Thursday, July 24, 2014

గుండె పగిలిన తండ్రి.

వహీద్ ...
వహీద్ ...
ఏడీ ... నా బంగారు తండ్రీ .. ??
రజియా .. రజియా ..
నా తల్లే .. ఎక్కడున్నావమ్మా?
ఇప్పుడే కదండ్రా .. నా చెంపలపై చెరో ముద్దు ఇచ్చి
మీ పెదాలకు అంటుకున్న నా బుగ్గల చెమటను
మీ యునిఫామ్ కాలర్ కి తుడుచుకుని
బస్సెక్కి గాల్లోకి నాకో నవ్వు విసిరి
నాన్న ఈవినింగ్ వరకు ఈ నవ్వును దాచుకో అని చెప్పి
వెళ్లారు .. పది నిమిషాలేగా ... అయ్యింది.

రజియా .. రజియా.. నా బంగారు తల్లే..!!
ఎక్కడున్నావ్ నాయనా..??
ఒక్కసారి "అబ్బూ నీను ఇక్కడే ఉన్నా " అని ఓ సారి పలకరా తల్లి ..
కంట్లో చాక్ ఫీసు డస్ట్ పడిందని ఒక రోజంతా ఎడ్చావు కదా తల్లి ..
ఈ ఇనప పెట్లకింద  యాడ నలిగిపోతున్నావ్ రా నాయనా ..

ఒకే ఒక్కసారి పలుకు నాయనా ..
బాబు వహీద్...
రేయ్ .. కొడకా..
చిన్న దోమ కుడితేనే నిద్రపోనోడివి ..
ఈ ఇనప రాడ్లల్లో ఎక్కడ పడున్నవురా .. అయ్యా ..

కొడుకో .. నా తండ్రి...
ఒక్కసారి "అబ్బు ఇక్కడే ఉన్న " అని ఒకసారి పలకరా..
ఎంతకి పలకని ఆ చిన్నారుల గొంతులు
...............................
ఈ తండ్రి గుండె ఇక కొట్టుకోవడం శాశ్వతంగా ఆగిపోయింది.
------------------------------------------------------------
( మెదక్ జిల్లా మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర స్కూల్ బస్సును రైలు  డి కోట్టిన ఘటనలో 20 మంది చిన్నారులలో ..వహిద్, రజియా కూడా ఉన్నారు .. ఈ వార్త విన్న ఈ చిన్నారుల తండ్రి గుండెపోటుతో మరణిచారు)
24-07-2014.