Tuesday, June 28, 2011

నా కవిత్వం కేవలం మనిషికి డిఫెన్స్!- శేషేంద్ర

ఎక్కడ కేంపులోలికే కెమిలియాలు నిశ్శబ్ద
మాదురిమలో
నీలి నీలి కలలు కంటున్నాయో
ఎక్కడ చెట్లు యౌవనపు ఆకుల్ని
రాలుస్తున్నాయో
భూమి నాగరికతల్ని రాల్చినట్టు ,
ఆయూక లిప్టస్ అడవుల్లో పరుగిదదాంపద-

* * *

పోదాం పద ఆ అడువుల్లోకి
ఎక్కడ రాలే హేమంత పత్రాల మీద
సూర్యుడు మనిషికోసం
సందేశాలు రాస్తున్నాడో
ఆ అడువుల్లోకి -
* * *

ఆకాశం విసిరే పిడుగులకు
అడ్డం లేదు
నా వాక్యాలకు కాపలా లేదు
అరే అవి జూ నుంచి తప్పించుకున్న
సింహాలు
మనుషుల మీదకి దూకే
భయంకర ఓనమాలు

* * *

చంపి కొండల్లో పారేశిన వాడి శరీరం
రాగం కోసం బిగించిన ఫిడేలులా పడి వుంది
వాడినోరు పాడిన పాటలు
ప్రవహించే నదులు ఆగి ఆలకించేవి
చావులేని వాడ్ని చంపిన మూర్ఖులకు
తెలీదు
ఏ మృత్తిక పువ్వును మనిషికి కానుకగా
ఇచ్చిందో అది వాడి నిర్మాణంలో ఉందని
* * *

కోకిల పుస్తకాల నుంచి పారిపోయి
కొమ్మ ఎక్కిన గాన సామ్రాట్టు
చంద్రుడు ప్రణయాగ్నుల్లో కాల్చిన
పెసరట్టు
* * *

ఎవడు ఏడవగలడు
మరోకడికోసం!
అంతశక్తి ఎవడి కుంది
నీ కోసం ఏడ్చే వాడికి
నీవు ఋణగ్రస్తుడివి
మార్క్స్ కు ఈ శతాబ్దపు
అన్నార్తులందరూ
ఋణ గ్రస్తులు
* * *

వాడు ఎందుకు చస్తున్నాడనుకున్నావ్
ఆ అడవుల్లో అన్ని గాయాలతో-
వాడు ఎందుకు మరణిస్తున్నాడు!
ఎందుకంటే
వాడికి ఇవ్వబడిన ఆయుస్సు చాలదు
నూరేళ్ళకు బదులు వెయ్యేళ్ళు కావలి
మందులతో రాదు అమరత్వం
మరణంతో వస్తుంది
* * *





శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు
ఒక మధు పాత్రలా
అతడు కవి అయి వుంటాడు
ఒక గీతికతో ఈ వసంతరుతువుకు
ప్రారంభోత్సవం చేసిందెవరు
అది కోకిల అయి ఉంటుంది
సూర్యుడు దున్నుకుంటూ వస్తాడు
మన ప్రాతఃకాల స్వప్నంలోకి
నక్షత్రంలా నగ్నమైన ఆమె తనువూ
చేపలా వస్తుంది
నా అరచేతిలోకి-
* * *

కొండలు కొండలే చేధిస్తున్నారు
అరే నీళ్ళ నెంత భాదిస్తున్నారు
డాములు కట్టి కాలువలు త్రవ్వి
ఆకలి తరపున సృష్టితోనే వాదిస్తున్నారు

* * *

సముద్రమైన మనిషిలో నుంచి
సత్యం ఎండిపోవడం చూస్తే
ధరిత్రి మీద
సముద్రాలూ ఎండిపోతాయని
భయమేస్తుంది
పర్వతాలు పారిపోతాయని
భయమేస్తుంది
వృక్షాలు పుష్పవతులై నడిచే రోజు
రాదని భయమేస్తుంది


* * *

మెదడు లేని క్యాబేజీ వాడి తల
నగరాల్లో ఉన్న కాలేజి వాడి వల
వాడు బంగాళాఖాతంలా నోరు
తెరచి ఆవులిస్తాడు
మాటల చెత్త కుప్పలు సృష్టిస్తాడు
త్రవ్వగా త్రవ్వగా
మొహంజోదారోలో కుండపెంకులా
వాడి పుస్తకాల దిబ్బల్లో
ఎక్కడో ఒక పోయెం-
* * *


జీవన భాషలో చెట్టు ఒక
ఛాయామయ విరామం
ఎక్కడ చేరి పక్షులు మనుష్యులు
నిశబ్దాలై కలలు కంటారో-
దాన్ని విరిచి గొడ్డలి చేయకు
దాన్ని ఉరికంబం చేయకు
దేశపు వీరత్వాన్ని దానికి వేలాడదీయకు

* * *

జీవించిన వాడు పళ్ళుగా ధాన్యంగా
మారిన భూమిని తింటాడు
మరణించిన వాడు
వట్టి భూమినే తింటాడు

* * *


ఏ నక్షత్రం కోసం
నిరీక్షిస్తూ
నా పాటలన్నీ పాడేనో
అది ఈ దేశం మీద
ఉదయించనే లేదు
ఎగిరి పోయింది
మా వయస్సు మాత్రం
వాలి పోయిన ఆకాశంలో
ఒక పక్షిలా-
* * *

అరే ఈ కోకిలలు పాడుతున్నాయే
వాటికి మా కన్నీళ్ళు కనిపించవా ఏమిటి!
ఒంటి మీద వసంతం పూసుకున్న వాడికి
గుండెల్లో జీవన పోరాటాలు ఉండవాఏమిటి!
* * *

మీకు కావాలి
పుస్తకాల్లో ఉండే చంద్రుడూ
ఆకాశమూ
కారణం మీ భవనాలూ
మిమ్మల్ని ఆకాశం నుంచి
విడదీశాయి
చలికాలంలో కూడా
చందమామ ఆకాశము
మాతో కలిసే ఉంటాయి
చలికి చనిపోయిన మా పిల్లలు
చంద్రలోకం వెళ్లి ఆడుకుంటారు
* * *




ఎవడి చేతనలో విమాన దాడులు
జరుగుతాయో
నగరాల భారీ గోడలు
బాంబుల వర్షాల్లో కూలుతాయో
సైన్యాల బూట్లు ఎవడి జీవన పేజీలమీద
నడుస్తాయో
దేశాల ఇనపతీగెలు చెల్లాచెదరై పోతాయో
ఎవడి గుండెల్లో
మానవ రక్తం గొంతులెత్తి విలపిస్తుందో
ఎవడి మెదడులో నక్షత్రం బ్రద్దలౌతుందో
వాడే పద్యాల పితామహుడు-
* * *

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కుర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు
నేనింత పిడికిడు మట్టె కావొచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండా కున్నంత పొగరుంది
* * *

నవ్వు మొహాన రాశిన వాళ్ళని చూస్తే
నా చెయ్యి బాంబు కోసం వెతుకుతుంది
వాళ్లకు నవ్వేంతటి సుఖం ఎలా దొరికింది
ఈ దేశంలో:
ఈ దేశంలో వంగే వాడికి
వంగి సలాం చేసే వాడు పుడుతున్నాడు
జాగ్రత్త:
ఈ లక్షణం తల యేత్తిందంటే
ఆకాశంలో తోక చుక్క పుట్టిందన్నమాటే

* * *
నా అవయవాలకు నీచంగా వంగే
భంగిమలు తెలీవు - నేను సత్రగ్రహిని
నా కశ్మల శరీరాన్ని దగ్ధం చేసుకుని
తప్త హిరణ్య ద్రవంగా ప్రవహిస్తున్నాను
నా దేశపు రహదారుల్లో -
రండి నాతో కలిశి.