Thursday, February 11, 2016

ప్రవచనం (ఖలీల్ జీబ్రాన్ రచన)


=====================================
ఆ తరువాత నాగలితో నేలను దున్ని
పంటలు పండించే రైతు అడిగాడు -
"పని అంటే ఏమిటో మాకు చెప్పండి " అని.
ఆల్ ముస్తఫ్ఫా బదులుగా ఇలా చెప్పాడు.
నీవు పనిచెయ్యి - ఎలాగంటే
భూమి మీద నడుస్తూ
భూమాత మనసుని అర్ధం చేసుకుంటూ
మును ముందుకు సాగు.
సోమరి పోతుగా మారిపోయవో
ఆగమించె ఋతువుల మధ్య
ఆగంతుకునిగా మిగిలిపోతావు!
అనంతమైన దిశగా
అపారంగా రాజస గర్వంగా
సాగిపోతున్న జీవన యాత్ర నుండి
నీవు విడివడి పోబాకు!
పని చేసేటప్పుడు నీవే ఒక వేణువు.
ఆ వేణువులో నీ హృదయం లీనమవుతుంది.
గడిచే గంట కాలం
ముగ్ధమనోహర గానమై వెలువడుతుంది.
అందరు బృందగానం చేస్తుంటే
మీలో ఏ ఒక్కరైన సరే
మూగగా, నిశ్శబ్దంగా, రెల్లుగా ఉండలేరు.
మీరు అస్తమానం అంటుంటారు-
పని ఒక శాపం అని ,
కాయకష్టం దురదృష్టం అని,
కానీ నేనంటాను-
నీవు పని చేస్తున్నవంటే
భూమి చిరకాల స్వప్న పాత్రని
నీవంతు కొంత నింపుతున్నవనీ
ఆ స్వప్నం పుట్టినప్పుడే
నీ వంతు పని నిర్దేశిత మైందని గ్రహించు.
శ్రమిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడే నీవు
జీవితాన్ని నిజంగా ప్రేమిస్తావు.
కష్టిస్తూ జీవితాన్ని ప్రేమించినప్పుడు
జీవన రహస్యానికి చేరువ అవుతావు.
కానీ నీవు-
బాధలో ఉన్నప్పుడు-
పుట్టుక అనేది ఒక పాపం అని
ఉదర పోషణ అనేది ఒక నొసటరాత అనుకుంటావు.
కానీ నేనంటాను-
నుదిటి నుంచి చెమట కార్చినప్పుడే
నీ తల రాత కూడా మారిపోతుంది-అని.
జీవితం అంధకార బంధురం - అని కూడా
నీతో చెప్పి ఉంటారు.
అలసి పోయినప్పుడు
ప్రతిద్వనిస్తావు నీవు - అని
నేను చెబుతాను.
జీవితం చీకటిమయమే
కానీ జీవన కాంక్షతో కాంతివంతం చేసుకో.
కాంక్ష గుడ్డిదైనప్పుడు
జ్ఞానంతో ద్రుష్టినింపుకో.
జ్ఞానమంతా వృధానే కానీ
కృషితో ప్రయోజకత్వం చేసుకో.
సమస్త కృషి శూన్యమే
ప్రేమతో సమృద్ధం చేసుకో.
ప్రేమ పూర్వకంగా నీవు కృషి చేస్తే
నీతో నీవు, అందరితో నీవు,
చివరికి దైవంతో నీవు ఐక్యమయి పోతావు
ప్రేమతో పనిచేయడం అంటే ఏమిటి ?
హృదయం అనే దారం ఉండ నుండి
పోగులు తీసి నీ నేస్తాలకోసం వస్త్రంగా నేయడమే!
నీ వాళ్ళు నివసించాలనే ఆశతో
ఇల్లు ఒకటి అభిమానంగా కట్టడమే!
ప్రేమతో గింజలు నాటి, చేతికందివచ్చాక
ఆనందంగా కోసి నీ వాళ్లకు
ఆ ఫలాలను ఆహారంగా సమకూర్చోకోవడమే!
ప్రేమగా పనిచేయడమంటే -
ప్రతి చర్యను నీదైన శైలి లోకి తెచ్చుకుని
వానిలో ఆత్మనీ ఊపిరిని నింపడమే!
స్వర్గస్థులైన నీ వారంతా నిలబడి
నిన్ను ఆశీర్వదిస్తున్నారు తెలుసుకో.
తరచు మిమ్మల్ని-
"కలలో పలవరించడం" విన్నాను నేను -
చలువరాతిలో తన ఆత్మనే శిల్పంగా
సాక్షాత్కరింప చేసిన శిల్పి,
హలం పట్టి పొలం దున్నేవానికంటే
యెంతో మిన్న అని,
వర్ణ శోభిత ఇంద్రచాపాన్ని అందుకుని
మనిషి మెచ్చే వస్త్రాన్ని నేసే చేనేత కళాకారుడు-
కాళ్ళలో తొడిగే చెప్పులుకుట్టే చర్మకారుని కంటే
యెంతో మిన్న అని,
కానీ, నేను నిదురలో కాదు-
నది నెత్తి మద్యాహ వేళ
మెలుకువలో ఉండే అంటున్నాను-
గాలి తను వీచే దారిలో ఎదురయ్యే వృక్షంతో
ప్రేమ పుర్వకంగాను,
గడ్డి పరకలతో నామ మాత్రంగాను పలకరించదు.
గాలి స్వరాన్ని, ప్రేమ భరిత
సుమధుర గానంగా మలచ గలిగినవాడే చాలా గొప్పవాడు.
పని అంటే - ప్రేమకు రూపం ఇవ్వడమే
ప్రేమతో కాకుండా విసుగుతో చేయడం కంటే -
ఆ పనిని విడిచి పెట్టి,
ఏ గుడి ముంగిటనో కుర్చుని-
ముష్టి యెత్తుకో!
ఉపేక్షతో నీవు కా ల్చిన రొట్టె
పాడయి పోయిన రొట్టె కద అవుతుంది
అది మనిషి అర్దాకలినే తీరుస్తుంది.
కక్షతో నీవు ద్రాక్ష పానీయం తయారు చేస్తే
అది విషపూరిత పానీయమే కదా అవుతుంది.
గాన గందర్వునిలా నీవు పాడినా
ఆ పాటలో నీ ప్రేమ లేకపోతే
అది పగటి పూటైన
అది రాత్రి పూటైన
కర్ణ కఠోరంగానే కదా వినిపిస్తుంది.