Tuesday, June 12, 2018

మతం వేరు - మతోన్మాదం వేరు


మతోన్మాద సంస్థలు మతాన్ని స్వంతం చేసుకుని మాట్లాడుతుంటాయి. ఆశ్చర్యమేమిటంటే ఒక్కోసారి లౌకికవాదులని చెప్పుకునేవారు సైతం మతోన్మాదులని విమర్శంచే పనిలో మొత్తంగా మతాల్ని విమర్శించేస్తుంటారు.
హిందూ మతమో,ఇస్లామో , క్రైస్తవమో, బౌద్దమో... ఏదైన కానీ .. ప్రపంచంలో ఏదైన ఒక మతాన్ని అనుసరిస్తూ ఆస్తికులుగా ఉన్న జనాభానే అత్యధికం. మరి మతానికీ, మతోన్మాదానికీ తేడా లేక పోతే ప్రపంచంలోని ఆస్తిక జనాభా అంతా మతోన్మాదులే కావాలి.
ఈ ధోరణి తప్పు అని చెప్పడానికి పెద్ద చర్చ అవసరంలేదు. మతాన్ని అనుసరించే ప్రజలంతా మతోన్మాదులు కారు.
మతాన్ని, మతోన్మాదాన్ని వేరు చేసి మాట్లాడాలి. మతోన్మాదుల్ని ఒంటరిని చేయాలి. మతోన్మాదుల స్వరాలు మతాలకు డబ్బింగ్ చెప్పనీయరాదు. మతవేదికల నుంచి మతోన్మాదాన్ని తరిమివేయాలి.
గుజరాత్ లో హిందూ మతోన్మాదులు ముస్లిం జనాలపై చేసిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... స్త్రీల పై మృగాల్లా గ్యాంగ్ రేపులకి పాల్పడ్డారు... మూడన్నర సంవత్సరాల బాలికలను సైతం వదలలేదు.. తర్వాత వారిని ముక్కలుగా నరికి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. నోటి నిండా కిరోసిన్ తాగించి ... నోట్లో అగ్గిపుల్ల వేసి మనుషుల్ని పెట్రోలుబాంబులుగా పేల్చేసిన సంఘటనలు... వికలాంగుల్ని సైతం మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి కాల్చేసిన విద్వేషం... గర్భాన్ని చీల్చి పిండాల్ని మంటల్లో వేసిన దారణాలు.... శిశువుల్ని సైతం కాల్చేసిన క్రూరత్వాలు... ఈ కసాయి పనులు చేస్తూ ఆ మృగాలు ఏమని నినాదాలిచ్చాయో తెలుసా... 'జై శ్రీరామ్'. జై శ్రీరామ్'
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే! రామాయణంలో రాముడు తన భార్యని ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్దం చేశాడు. రాముడు రేపిస్టులకీ, హంతకులకీ, దేముడెలా అవుతాడు? అలా అనడానికి ఎవరికైన ఎంత ధైర్యం?
సీతను ఎత్తుకెళ్లిన రావణుడు సైతం ఆమెను బందీగా చేసినా గౌరవంగా చూశాడేకానీ ఈ తరహా ఆకృత్యాలకు పాల్పపడలేదు కదా.... ఈ పిశాచులు పవిత్ర రామనామం సంగతి అటుంచి, రావణుడి పేరు ఎత్తేందుకు కూడా అర్హత లేని హీనులు.
బజరంగ్ దళ్ అంటే హనుమంతుడి సైన్యం అని అర్థం. హనుమంతుడు, వానరసైన్యం సీతను ఎత్తకెళ్లిన రావణుడితో యుద్దం చేశారు. హన్మంతుడు ఆజన్మ బ్రహ్మ చారి, పరమ భక్తుడూ, సీతని విడిపించే ధర్మకార్యానికి సాహసంతో ముందుకి దూకిన వాడూ, రామ నామం పట్ల నిరుపమాన భక్తి కలవాడు.
హనుమంతుడి పేరు చెబితేనే పిశాచాలు పారిపోతాయంటారు. హత్యలు రేపులు, రేపులు చేసే పిశాచాలు - పరమ భాగవతోత్తముడు ఆంజనేయుడి పేరు ఎలా పెట్టుకుంటారు? హంతకుల, రేపిస్టుల, లూటీకారుల, నేరస్తుల సైన్యం - పిశాచ దళ్ అని పేరు పెట్టుకోవాలి కానీ బజరంగ్ దళ్ అని పేరు ఎలా పెట్టుకుంటారు?
గుజరాత్ హంతకమూకల చర్యలను ఏ మత గ్రంథం సమర్థిస్తుంది,
వివేకానందుడూ, ఠాగూర్, గాంధీ, నారాయణగురు, వంటి మహానీయులనీ, అందించిన ధర్మానికి అంతర్జాతీయంగా మచ్చ తెస్తున్న హంతకుల లూటీదారులు మూక - హిందూ మతానికి ప్రతినిధులు ఎలా అవుతారు?
ఇస్లాం అంటే శాంతి అని అర్ధం. భగవంతుని పట్ల నిష్ఠ, విశ్వాసం ఇస్లాంకి ప్రాణశక్తి.
హిందూ ముస్లింల మైత్రికి పునాది వేసిన ఆదర్శ పాలకుడు అక్బర్, కారణజన్ముడు కబీర్, స్వాతంత్రోద్యమ సింహం 'అష్ఫా ఖుల్లా' హిందూ ముస్లిం మైత్రిని కోరిన అబ్దుల్ కలామ్ ఆజాద్, 'ఖుదాయే ఖిద్మత్ గార్' వంటి త్యాగపూరిత సంస్థని సృష్టించిన మహాత్ముడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్' దేశ రక్షణని తపస్సుగా స్వీకరించిన ఋషితుల్యుడు అబ్దుల్ కలామ్' లోకోత్తర కళాకారుడు బిస్మిల్లాఖాన్' యుద్ధరంగంలో విజృంభించి మూడు పాకిస్థాన్ ట్యాంకుల్ని పేల్చి, ఆత్మాహుతి దాడితో నాలుగవ ట్యాంకుల్ని పేల్చి చివరికి అమరుడైన పరమవీర చక్ర అబ్దుల్ హమీద్, భారత్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉప ఖండం ప్రజలను వందేమాతరం స్ఫూర్తిలో ఓలలాడించిన ఎ. ఆర్. రహమాన్ ...ఒక్కరా ఇద్దరా ... భారతీయా ఇస్లాం ఎన్ని అమూల్య రత్నాలను అందించిందని .. భారతీయ ఇస్లాం స్ఫూర్తికి ప్రతినిధులు అయ్యేది వీరు.
జమ్మూలో బస్ లో చొరబడి, కాశ్మిర్ లో గ్రామాల్లో చొరబడి ... హిందువులని సిక్కులని వేరు చేసి పిల్లాపాపలతో సహా - నిలబెట్టి కాల్చి చంపే రాక్షసులు , గోధ్రాలో రైలు బోగీకి నిప్పు పెట్టి, చివరికి తప్పించుకుని కిందకి దూకే ప్రాణాలని కూడా నరికి మంటల్లో వేసే పాపాత్ములు... మాతృదేశానికి ద్రోహం చేసి పొరుగు దేశపు కనుసైగతో ఇక్కడ విధ్వంసానికి తెగబడే ఉన్మాదులు... భారతీయ ఇస్లాం కి ప్రతినిధులు ఎలా అవుతారు? అసలు ఆ పాపాత్ములు ముస్లింలు ఎలా అవుతారు.? ఖురాన్ కానీ, మారే పవిత్ర గ్రంథమైన వారి దౌష్ట్యాలను ఎలా సమర్థిస్తుంది? వారు తమపాపాలకు సాకుగా ఇస్లాంను, ఖురాన్ ను ఎలా చూపగలరు?
హిందువులైన, ముస్లింలైనా... మతోన్మాదులను మతాలనుంచి వేరు చేయాల్సిన అవసరం ఉంది.
నిజమైన హిందువులు, ముస్లిం లు.. ఆస్తికులు - ఈ ఉన్మాదుల చర్యలను ఖండించాలి. వారు మతం పేరుని ఉపయోగించుకోలేని పరిస్థితిని తీసుకురావాలి
ఆర్.ఎస్.ఎస్ హిందువులకి, హిందుస్తానికి, వ్యతిరేకి, శత్రువూ...
ఆర్.ఎస్.ఎస్ వేషం... ఖాకీ నిక్కరూ, నల్ల టోపీ.. భారతీయ ఆహార్యం కాదు , (మహా అయితే ఈ ఖాకీ నిక్కర్లకి 1925 నాటి బ్రిటిష్ పోలీసుల ఆహార్యం స్ఫూర్తి అయి ఉండవచ్చు)
మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు ,దేశప్రజలంత ఇక్కట్ల పాలవుతూ భారతమాత శృంఖలాలు తెంచేందుకు హిందువులూ ముస్లింలూ సమైక్యంగా స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న కాలంలో ఆర్.ఎస్.ఎస్ ఆ మహత్యర పోరాటానికి దూరంగా ఉంది. ఆర్.ఎస్.ఎస్. భావజాలంతో స్ఫూర్తి పొందిన వ్యక్తే జాతిపీత గాంధీజీని చంపేశాడు. నాడు ఆర్.ఎస్.ఎస్ దేశ ప్రజల ఆగ్రహాన్ని, అసహ్యాన్ని చవిచూసింది.
మాట్లాడితే జాతీయత గురుంచి వల్లెవేసే ఆర్.ఎస్.ఎస్ నిజానికి జాతిని ముక్కలు చేయడమే అజెండాగా పెట్టుకుంది. ఆర్.ఎస్.ఎస్ కి ఎంతగా దేశభక్తి లేదంటే .... చివరికి మొన్నమొన్నటి వరకూ అది మన జాతీయ పతాకానికి సైతం వ్యతిరేకం . ఆ మధ్య కర్ణాటక లోని ఒక ఈద్గా మైదానం లో మన జాతీయ జెండా ఎగరవేయట్లేదని సంఘ్ పరివార్ శక్తులు గొడవలకి దిగారు. నిజానికి వారికి గొడవలపైనే ఎక్కువ ఆసక్తి, జాతీయ జెండాపై కాదు.
ఎందుకంటే దశాబ్దాలుగా ఆర్.ఎస్.ఎస్ నాగపూర్లోని తన కార్యాలయం పైన ఏనాడూ జాతీయ జెండా ఎగరవేయలేదు. కేవలం పోయినేడు ఆగష్టు 15న ఏ కారణం చేతో వారు తమ పద్ధతి మార్చుకున్నారు .
సంఘ్ పరివార్ బహురూపి. స్వతంత్ర భారత్ చరిత్ర లోనే దేశ విభజన తరువాత అత్యంత దారుణ మైన విషాదం బాబ్రీమసీదు కూల్చివేత. ఈ నేరానికి బాధ్యత సంఘ్ పరివార్ దే. బాబర్ అయోధ్యలో దైవ మందిరాన్ని కూలగొట్టాడో లేదో మనకి తెలీదు. దానికి సరైన ఆధారము లేదు. అయితే మధ్య యుగాల సంగతి విడిచిపెడితే ...ఆధునిక కాలంలో అయోధ్య లో ఒక దైవ మందిరాన్ని కూల్చింది సంఘ్ పరివార్ .అందుచేత నిజమైన అర్ధం లో 'బాబరుకి ఔలాద్' ఆర్.ఎస్.ఎస్ అవుతుంది , భారతీయ ముస్లింలు కారు . మధ్య యుగాల్లో భారత దేశ శత్రువులు నాదిర్షా,గజినీ , ఘోరీలు చేసిన దారుణాలను ఇవ్వాళ సంఘ్ పరివార్ నిస్సిగ్గుగా చేస్తోంది. గుజరాతీలో వందల మసీదులను పరివార్ గుండాలు ధ్వంసం చేసారు .తాము గజినీ వారసులమని గజినీ తమకు ఆదర్శమని పరివార్ శక్తులు ఇప్పుడు ప్రతక్షయంగానే అంగీకరిస్త్తున్నారు. వి .హెచ్ . పి కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ఇటీవల ' మనం హిందూ గజినీలు అవుదాం' అని గర్వాంగానే చెప్పుకున్నారు
(నిషిద్ధ సంస్థ సిమి ఇండియాకి మరో గజినీ కావాలని ఉత్తర భారత దేశం లో పోస్టర్లు వేసింది . ఆ సంస్థ అధ్యక్షుడు డా: బదర్ గజనీ పట్ల తన ఆరాధనని దాచుకోరు. హిందూ ముస్లిం మతోన్మాదులు ఇద్దరికీ గజనీ ఆర్యాదుడు. అందుచేత వీరిద్దరినీ 'గజనిస్టు'లనో ' ఘోరీయిస్టుల' నో పిలవడం సమంజసం.)
ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమాన్ని "హిందుత్వ' అనడం, దాని దుర్మార్గాల్ని కాషాయీకరణ అనిపిలవడం - చాల పొరపాటు, హిందుత్వం- అంటే హిందూ మతం యొక్క సారాంశం అని అర్ధం. ఇస్లాం తత్వానికి 'సిమి' ప్రతినిధి' కానట్టే, హిందుత్వానికి ఆర్.ఎస్.ఎస్ ప్రతినిథి కాదు. ఒకవేళ ఆర్.ఎస్.ఎస్ చెప్పుకున్న దాని వ్యతిరేకులు సైతం ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాన్ని 'హిందుత్వం' గా పిలవటం పొరపాటు. 'కాషాయం' దేశంలోని కోట్లాది ప్రజలకు పవిత్రమైన వర్ణమని' కాషాయీకరణ అనే మాటను వ్యతిరేక అర్ధంలో వాడటం వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాడని - ఇటీవల కేరళ ముఖ్యమంత్రి ఎ.కె ఆంటోని సరిగానే చెప్పారు.
ఆర్.ఎస్.ఎస్. హిందూ మతానికి తాను ప్రతినిధినని ఏ రకంగా చెప్పుకుంటుంది? ఆ మాటకి వస్తే మొత్తం 'హిందూమతం' అని చెప్పబడేదానికి ఎటువంటి ఏకైక 'ఆధ్యాత్మిక కేంద్రం కానీ, మతాధిపతి కానీ గతంలో లేరు. ఇప్పుడు లేరు. ఆర్.ఎస్.ఎస్ కు హిందూమతపరంగా ఎటువంటి అధికారం లేదు. దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించే స్వతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ భాగస్వామి కాదు.
కాశ్మిర్ భారత్ లో అంతర్భాగమని అక్కడ ఉగ్రవాదులను పంపి కల్లోలాన్ని రెచ్చగొట్టడం మానుకోమ్మని - మన దేశంలోని అనేక ముస్లిం సంస్థలు, ప్రముఖులు పాకిస్థాన్ కి ఎన్నోసార్లు మొహం పగిలేలా చెప్పిన విషయం ఎందరికి తెలుసు?
ఇటీవల అమెరికాలోని మసాచు సెట్స్ సాంకేతిక సంస్థ వద్ద వున్నా దక్షిణాసియా సంఘం గుజరాత్ కల్లోల్లాన్ని చర్చించేందుకు ఒక సదస్సు ఏర్పాటు చేసింది.
ఆ సదస్సులో వి.హెచ్.పి. ప్రతినిధి చేసిన ప్రసంగం ఆవేశాలనే రెచ్చగొట్టింది. అయితే రామకృష్ణ మఠం ప్రతినిధిగా పాల్గొన్న స్వామి త్యాగానంద ప్రసంగం సర్వులను అలరించింది. ఆ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు:
"ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయాలపాలయ్యారో, ఎవరెవరు నిర్వాసితులు అయ్యారో, ఎందరి వాణిజ్య సముదాయాలు నాశనమయ్యాయో పత్రికల మూలంగా ఆయా అంకెలు వివరాలు మాత్రం మన వద్ద ఉన్నాయి. వేలాది కుటుంబాలు, మృతి చెందిన ప్రతి ఒక్కరూ, వారు తల్లి గానో, తండ్రిగానో, బిడ్డగానో, భర్తగానో లేక మరొకరిగానో ఉండవచ్చు, అయితే వారెంతటి విషాదం అనుభవిస్తున్నారో, అసలు వాస్తవ పరిస్థితి ఏమిటో మన ఎరుకలోని రాని విషయాలు. కుల ఘర్షణలలో మన ఆత్మీయులనో, ప్రియమైన వారినో కోల్పోయామన్న భావన మనకు కలిగితే ఈ విషాద నేపథ్యంలో చెలరేగిన భావావేశాలూ, అశాంతీ, భయానక పరిస్థితులనూ, మనం క్షుణంగా అర్ధం చేసుకోగలము.
సాటి మానవులపై జరిగిన ఈ దారుణాన్ని భావసారూప్యం కలిగిన వారంతా త్రీవ్రంగా ఖండించడం సమంజసమే..."
"...ప్రతి మతంలోనూ ప్రేమా, పరస్పర అవగాహన, శాంతిని గురించి మనం భోధిస్తున్నాము. అయితే మతం రంగుపులుముకుని కొన్ని వర్గాలు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి అర్ధం చేసుకోలేక పోతున్నాం.."
"...మతం అంటే ఏమిటి మతతత్వం అంటే ఏమిటి హింసకు తావులేకుండా మతం పట్ల విశ్వాశంగా ఉండలేమా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు ఎలాంటి ఉపద్రువాలనుంచైనా ప్రశాంతంగా, సునాసాయంగా బయట పడగలం..."
'...మన దైనందిన జీవనంలో వాక్సమేతంగా, భౌతికపరంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా ఉంటేనే మన ఖండన పూరిత సందేశాలకు అర్ధం ఉంటుంది. మన వివాదాలకు, అనంగీకారాలను పరిష్కరించుకోటానికి మార్గాలను అన్వేషించగల సత్తా మనకుంది. ఇలాంటి పరిస్థితులలో పరస్పర అవగాహన, గౌరవపూర్వక వాతావరణంలో చర్చలు జరపటమే ఉత్తమమైన పరిష్కార మార్గం. నిర్మాణాత్మకంగా, శాంతి పూర్వకంగా చక్కటి పరిష్కార మార్గాన్ని అన్వేషించటానికి ప్రయత్నిద్దాం. మనకు అంగీకారం కాకపోయినా ఇతరులు ఏమి చెబుతున్నారో వినేందుకు ప్రయత్నించడమే కార్య సంకల్పానికి శుభారంభం అవుతుంది. మన ఎదుటి వారి మాటలను మనం పట్టించుకోనప్పుడు, మన మాటలను వారు ఖాతరు చేయాలని, మనల్ని అర్ధం చేసుకోవాలని ఎలా ఆశించగలం?"
మతానికీ మానవత్వానికి నిర్వచనం ఇదీ!
కాదని ఎవరనగలరు - ఒక్క మతోన్మాదులు తప్ప.
'జైభారత్ సంస్థ మన మహత్తర దేశంలో, మతాలనుంచి, మొత్తంగా ప్రజా జీవనం నుంచీ మతోన్మాదాన్ని వేరు చేసి, ఓడించే దిశగా పనిచేస్తుంది'
( విజయవిహారం జూన్ 2002)
వివరాలకు:
జైభారత్ కేంద్ర కార్యాలయం,
9849995538.

Thursday, February 11, 2016

ప్రవచనం (ఖలీల్ జీబ్రాన్ రచన)


=====================================
ఆ తరువాత నాగలితో నేలను దున్ని
పంటలు పండించే రైతు అడిగాడు -
"పని అంటే ఏమిటో మాకు చెప్పండి " అని.
ఆల్ ముస్తఫ్ఫా బదులుగా ఇలా చెప్పాడు.
నీవు పనిచెయ్యి - ఎలాగంటే
భూమి మీద నడుస్తూ
భూమాత మనసుని అర్ధం చేసుకుంటూ
మును ముందుకు సాగు.
సోమరి పోతుగా మారిపోయవో
ఆగమించె ఋతువుల మధ్య
ఆగంతుకునిగా మిగిలిపోతావు!
అనంతమైన దిశగా
అపారంగా రాజస గర్వంగా
సాగిపోతున్న జీవన యాత్ర నుండి
నీవు విడివడి పోబాకు!
పని చేసేటప్పుడు నీవే ఒక వేణువు.
ఆ వేణువులో నీ హృదయం లీనమవుతుంది.
గడిచే గంట కాలం
ముగ్ధమనోహర గానమై వెలువడుతుంది.
అందరు బృందగానం చేస్తుంటే
మీలో ఏ ఒక్కరైన సరే
మూగగా, నిశ్శబ్దంగా, రెల్లుగా ఉండలేరు.
మీరు అస్తమానం అంటుంటారు-
పని ఒక శాపం అని ,
కాయకష్టం దురదృష్టం అని,
కానీ నేనంటాను-
నీవు పని చేస్తున్నవంటే
భూమి చిరకాల స్వప్న పాత్రని
నీవంతు కొంత నింపుతున్నవనీ
ఆ స్వప్నం పుట్టినప్పుడే
నీ వంతు పని నిర్దేశిత మైందని గ్రహించు.
శ్రమిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడే నీవు
జీవితాన్ని నిజంగా ప్రేమిస్తావు.
కష్టిస్తూ జీవితాన్ని ప్రేమించినప్పుడు
జీవన రహస్యానికి చేరువ అవుతావు.
కానీ నీవు-
బాధలో ఉన్నప్పుడు-
పుట్టుక అనేది ఒక పాపం అని
ఉదర పోషణ అనేది ఒక నొసటరాత అనుకుంటావు.
కానీ నేనంటాను-
నుదిటి నుంచి చెమట కార్చినప్పుడే
నీ తల రాత కూడా మారిపోతుంది-అని.
జీవితం అంధకార బంధురం - అని కూడా
నీతో చెప్పి ఉంటారు.
అలసి పోయినప్పుడు
ప్రతిద్వనిస్తావు నీవు - అని
నేను చెబుతాను.
జీవితం చీకటిమయమే
కానీ జీవన కాంక్షతో కాంతివంతం చేసుకో.
కాంక్ష గుడ్డిదైనప్పుడు
జ్ఞానంతో ద్రుష్టినింపుకో.
జ్ఞానమంతా వృధానే కానీ
కృషితో ప్రయోజకత్వం చేసుకో.
సమస్త కృషి శూన్యమే
ప్రేమతో సమృద్ధం చేసుకో.
ప్రేమ పూర్వకంగా నీవు కృషి చేస్తే
నీతో నీవు, అందరితో నీవు,
చివరికి దైవంతో నీవు ఐక్యమయి పోతావు
ప్రేమతో పనిచేయడం అంటే ఏమిటి ?
హృదయం అనే దారం ఉండ నుండి
పోగులు తీసి నీ నేస్తాలకోసం వస్త్రంగా నేయడమే!
నీ వాళ్ళు నివసించాలనే ఆశతో
ఇల్లు ఒకటి అభిమానంగా కట్టడమే!
ప్రేమతో గింజలు నాటి, చేతికందివచ్చాక
ఆనందంగా కోసి నీ వాళ్లకు
ఆ ఫలాలను ఆహారంగా సమకూర్చోకోవడమే!
ప్రేమగా పనిచేయడమంటే -
ప్రతి చర్యను నీదైన శైలి లోకి తెచ్చుకుని
వానిలో ఆత్మనీ ఊపిరిని నింపడమే!
స్వర్గస్థులైన నీ వారంతా నిలబడి
నిన్ను ఆశీర్వదిస్తున్నారు తెలుసుకో.
తరచు మిమ్మల్ని-
"కలలో పలవరించడం" విన్నాను నేను -
చలువరాతిలో తన ఆత్మనే శిల్పంగా
సాక్షాత్కరింప చేసిన శిల్పి,
హలం పట్టి పొలం దున్నేవానికంటే
యెంతో మిన్న అని,
వర్ణ శోభిత ఇంద్రచాపాన్ని అందుకుని
మనిషి మెచ్చే వస్త్రాన్ని నేసే చేనేత కళాకారుడు-
కాళ్ళలో తొడిగే చెప్పులుకుట్టే చర్మకారుని కంటే
యెంతో మిన్న అని,
కానీ, నేను నిదురలో కాదు-
నది నెత్తి మద్యాహ వేళ
మెలుకువలో ఉండే అంటున్నాను-
గాలి తను వీచే దారిలో ఎదురయ్యే వృక్షంతో
ప్రేమ పుర్వకంగాను,
గడ్డి పరకలతో నామ మాత్రంగాను పలకరించదు.
గాలి స్వరాన్ని, ప్రేమ భరిత
సుమధుర గానంగా మలచ గలిగినవాడే చాలా గొప్పవాడు.
పని అంటే - ప్రేమకు రూపం ఇవ్వడమే
ప్రేమతో కాకుండా విసుగుతో చేయడం కంటే -
ఆ పనిని విడిచి పెట్టి,
ఏ గుడి ముంగిటనో కుర్చుని-
ముష్టి యెత్తుకో!
ఉపేక్షతో నీవు కా ల్చిన రొట్టె
పాడయి పోయిన రొట్టె కద అవుతుంది
అది మనిషి అర్దాకలినే తీరుస్తుంది.
కక్షతో నీవు ద్రాక్ష పానీయం తయారు చేస్తే
అది విషపూరిత పానీయమే కదా అవుతుంది.
గాన గందర్వునిలా నీవు పాడినా
ఆ పాటలో నీ ప్రేమ లేకపోతే
అది పగటి పూటైన
అది రాత్రి పూటైన
కర్ణ కఠోరంగానే కదా వినిపిస్తుంది.

Thursday, July 24, 2014

గుండె పగిలిన తండ్రి.

వహీద్ ...
వహీద్ ...
ఏడీ ... నా బంగారు తండ్రీ .. ??
రజియా .. రజియా ..
నా తల్లే .. ఎక్కడున్నావమ్మా?
ఇప్పుడే కదండ్రా .. నా చెంపలపై చెరో ముద్దు ఇచ్చి
మీ పెదాలకు అంటుకున్న నా బుగ్గల చెమటను
మీ యునిఫామ్ కాలర్ కి తుడుచుకుని
బస్సెక్కి గాల్లోకి నాకో నవ్వు విసిరి
నాన్న ఈవినింగ్ వరకు ఈ నవ్వును దాచుకో అని చెప్పి
వెళ్లారు .. పది నిమిషాలేగా ... అయ్యింది.

రజియా .. రజియా.. నా బంగారు తల్లే..!!
ఎక్కడున్నావ్ నాయనా..??
ఒక్కసారి "అబ్బూ నీను ఇక్కడే ఉన్నా " అని ఓ సారి పలకరా తల్లి ..
కంట్లో చాక్ ఫీసు డస్ట్ పడిందని ఒక రోజంతా ఎడ్చావు కదా తల్లి ..
ఈ ఇనప పెట్లకింద  యాడ నలిగిపోతున్నావ్ రా నాయనా ..

ఒకే ఒక్కసారి పలుకు నాయనా ..
బాబు వహీద్...
రేయ్ .. కొడకా..
చిన్న దోమ కుడితేనే నిద్రపోనోడివి ..
ఈ ఇనప రాడ్లల్లో ఎక్కడ పడున్నవురా .. అయ్యా ..

కొడుకో .. నా తండ్రి...
ఒక్కసారి "అబ్బు ఇక్కడే ఉన్న " అని ఒకసారి పలకరా..
ఎంతకి పలకని ఆ చిన్నారుల గొంతులు
...............................
ఈ తండ్రి గుండె ఇక కొట్టుకోవడం శాశ్వతంగా ఆగిపోయింది.
------------------------------------------------------------
( మెదక్ జిల్లా మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర స్కూల్ బస్సును రైలు  డి కోట్టిన ఘటనలో 20 మంది చిన్నారులలో ..వహిద్, రజియా కూడా ఉన్నారు .. ఈ వార్త విన్న ఈ చిన్నారుల తండ్రి గుండెపోటుతో మరణిచారు)
24-07-2014.


కన్నీళ్లు ఆగడం లెదు...

కన్నీళ్లు ఆగడం లెదు...

...............
బాయ్ నాన్న ..
బాయ్ మమ్మీ అని గట్టిగా  కౌగిలించుకుని
అమ్మ బుగ్గపై పెట్టిన ముద్దు తడి ఆరనే లేదు ..
నాన్న నేను ఈవెనింగ్ వచ్చేలోపు నీ సెల్లోకి కొత్త గేమ్ ని డౌన్లోడ్ చేసిపెట్టవా ..?
అని నాన్న నుండి తీసుకున్న మాట తాలుకు ఆనందం 
ఆబాబు మోములో ఇంకా దోబూచులాడుతూనే ఉంది.

మనకంటే పెద్ద వాడేగా  డ్రైవర్  అంకుల్..
మనకేం భయంలేదని భరోసాతో దోస్తు పెన్ను లాక్కుని 
తన చేతిలో రాసుకున్న బుజ్జి చెల్లాయి కొత్త పేరు
తెగిపడిన ఆ చేతిలో ఇంకా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అమ్మ ఆప్యాయంగా కలిపి పెట్టిన పెరుగన్నం
ఆ చిన్నారి రక్తంతో కళ్ళు చెదిరిపోయే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది.
అప్పుడే హొమ్ వర్క్ కంప్లీట్ చేస్కున్న  ఒక తమ్ముడి నోడ్సులో
ఓ చిన్నారి తల రైలు లాక్కేల్లడంతో దేనికో ఒరుసుకుని తలనుండి మెదడు ఉడి పడిపోయింది.

ఈ వార్త విని పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ తల్లికి
తను అప్పుడే హడావుడిగా ఉతికి ఆరి ఆరకనే తొడిగిన సాక్సు
ఒక కాలుకి తొడిగి ఉన్నట్టు కనిపించగానే
ఆ తల్లి ఆ కాలు పట్టుకుని మిగతా భాగాల కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే ఉంది.

ట్రైన్ ఈడ్చుకెళ్తున్న బస్సు నుండి ఓ బాబు
అంకుల్ ప్లీజ్ ట్రైన్ ఆపవా .. నాకాలు తెగి ఎక్కడో పడిపోయింది అరుపు...
కిలోమీటరు ఆ బస్సుని ఈడ్చుకెళ్ళి గాని ఆ ట్రైన్ ఆగలేకపోయింది .

కళ్ళ నుండే ప్రాణం పోయిందా అన్నట్టు ప్రాణం పోయిన
రెప్ప మూత పడని ఆ చిన్నారి కళ్ళు  నిర్లక్ష్యం నిండిన  
ఈ సమాజాన్ని ఎప్పటికి ప్రశ్నిస్తూనే ఉంటాయి

క్షణం క్రితం బోల్డన్ని కబుర్లు చెప్పుకుని నవ్వుకున్న ఆ పసి దేహాలు 
మరు క్షణం నిర్జీవపు ముద్దలయ్యాయంటే గుండెని ఎవరో పదునైన కత్తితో కోస్తున్నట్టే ఉంది ...
కన్నీళ్లు ఇప్పట్లో ఆగేలాలేవు ...
(ఈ రోజు మెదక్ జిల్లా మాసాయిపేట లో స్కూల్ బస్సుని రైల్ డీ కొట్టి 20 మంది పిల్లలు దారుణంగా చనిపొయారు. )

Sunday, May 18, 2014

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? 

-------------------------------------------------------------
ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగాపడిన ఒక ఆడకూతిరిలా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది.
తీరని కోరికలతో లక్ష్య బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది దేశం.
గాలికి ఉబ్బిపోయిన ఒక గుడారంలాగుంటుంది.
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం ఎలాగుంటుంది.?
ఐదేళ్ళ నిద్రకు కొంగుపరుచుకొంటున్న పిల్లల తల్లిలాగుంటుంది.
నా దేశం ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
అసత్య ప్రచారాల, జయ విజయధ్వానా ఘోష తగ్గినాక మనకి హఠాత్తుగా మన దరిద్ర సముద్ర హోరు వినిపిస్తుంది.
మనకి భోజనం లేదని గుర్తుకువస్తుంది.
మనకి ఉపాది లేదని, మనకి దిక్కు దివాణం లేదని,
మనకి తెరువూ, తీరు లేదని మళ్ళి గుర్తుకు వస్తుంది.
మనకి మళ్ళి వెనుకటి మన చక్రవర్తుల బిడ్డలా పట్టాభిషేకం గుర్తుకు వస్తుంది.
మన త్రివర్ణ పతాకం మీద పరాయి మనుషుల నీడలు పడుతున్నాయని, మనకి మళ్ళి భయం వేస్తుంది. పంచ వర్ష ప్రణాళికల ఓటి చప్పుడు వినిపిస్తుంది.
ఇరవై సూత్రాలకు ముడి లేదని, పథకాలు పారడం లేదని మనకి మళ్ళీ గుర్తుకు వచ్చి మన మీద మనకి జాలేస్తుంది.
సమస్యల పరిష్కారం కోసం కాక ఓటు నెల్లుకొవటానికి మనకి నినాదాలు వినిపించారని తెలుస్తుంది.
మనల్ని భయపెట్టి, మనల్ని భ్రమపెట్టి, మన భయాల్ని మనకి ఎరగా చూపి మనల్ని మనవాళ్ళే వేసుకున్నారని తెలిసి మనకి కొంత బాధ కలుగుతుంది.
రోగాలతో కుళ్ళి పోతున్న మన అమాయక దేశాన్ని మోసం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
గోపి చిన్న వాడని పడుచుని మందలోడు మోసం చేసినంత తేలికగా
మనల్ని "మనవాళ్ళు" చేయగలరు.
సోలడు గింజలకు మందులున్నాయి
అద్దెడు గింజలకు మందులున్నాయి
పిడికెడు గింజలకు మందులున్నాయి
తల నొప్పులకు మందులున్నాయి
శిరసు బాధలకు మందులున్నాయి
సూతిక నొప్పులకు మందులున్నాయి...
అని సైకిలెక్కి అసత్య ప్రచారం చేస్తాడు.
ఉత్తరాంద్రలో జానపదంలో మందుల మోసగాడు.
దారిద్రానికి మందులున్నాయి.
నిరుద్యోగానికి మందులున్నాయి.
సమైక్యతకు మందులున్నాయి.
సౌష్టవానికి మందులున్నాయి
అంటారు ఎన్నికలలో మనవాళ్ళు
సమస్యలు మిగిలిపోతాయి
నినాదాలు మారిపోతాయి
మందలోడు మారు వేషం వేసుకుని, మరో అసత్యప్రచారం ఆరంభిస్తాడు.
గోపిచిన్న వాళ్ళ భార్యలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మళ్ళీ వాటినే నమ్ముతారు. అందుకనే.
ఎన్నికలైపోయినాక ఒక విషాదాంతమైన ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం పరాయి వాడి పాలనలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.
ఎన్నికలైపోయినాక మనల్ని ఎవరో వెక్కిరిస్త్తున్నట్టే అనిపిస్తుంది.
ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది.
ఎన్నికల జ్వరం తగ్గిపోయిన తర్వాత మన పూర్వస్థితి గుర్తుకొచ్చి అంతా మునుపటిలాగే చీకటిగా, ఆకలిగా, నిరాశగా, నిస్సత్తువుగా అగమ్యంగా వున్నట్టు అర్ధం అవుతుంది.
పంచుకోలేక మనం తగవులాడుకుంటున్న రొట్టెను కోతి తినేసినట్టు తెలుస్తుంది.
అందరు సమానులేనని మనకి ఎన్నికలైపోయినాక తెలుస్తుంది.
పరాయి గజనీలైన, మన సొంత నిజాములైన ఒకటే అని బోధపడుతుంది.
శ్రీకృష్ణ దేవరాయలైన, ఔరంగాజేబైనా ఒకటేనని అర్ధం అవుతుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్ళకోసారి జీవితాంతం మోసపోవటం గురించి ఏడుపొస్తుంది.
మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మన మీద కొంత రోత పుడుతుంది.
మన బుద్ది గడ్డి తింటున్నాదని తెలిసీ సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,
పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.
ఈ మొహం మరో అయిదేళ్ళ వరకూ ఎవరికి చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.
........................................................................................................

- పతంజలి, ఉదయం దినపత్రిక, 29.12.1984 (పతంజలి భాష్యం నుండి)

Saturday, April 7, 2012

శంకర పీఠాధిపతులు అంటరానివారు.


ఆది శంకరులు స్థాపించిన శంకర మఠాలు పరమ ఛాందసానికి మూల కేంద్రాలుగా ఉంటూ వస్తున్నాయి. శంకరులు ప్రచారం చేసిన అద్వైతం ఉత్కృష్టమైన ఆదర్శం. శంకర మఠాలు ఆది శంకరుల అద్వైతానికి, మరీ ముఖ్యంగా ఆయన మనీషా పంచకం స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.
  ''..ఆమధ్య ఒక బహిరంగ సభలో ఒక స్త్రీ వేద పఠనం చేస్తుంటే, అది అధర్మమని, ఆ బహిరంగ సభలోనే ప్రకటించిన ఓ శంకరస్వాముల ఉదంతం పత్రికల్లో ప్రముఖ వార్తగా చోటుచేసుకుంది..'' అని రావిపూడి వెంకటాద్రి 'అడుగు జాడలు' పుస్తకం (పే.141)లో రాశారు.
ఏకంగా... 'సతి'నే సమర్థించిన శంకరాచార్య ఉన్నారు. మరి రావిపూడి వెంకటాద్రి చెపుతున్న శంకరాచార్యులు ఎవరో మనకి తెలీదు. బహుశా చంద్ర శేఖర సరస్వతి స్వామే కావచ్చు.
తి ఆది శంకరులు దేశమంతా తిరిగి మొత్తం నాలుగు పీఠాలు స్థాపించారు. అయితే మనకి ఇప్పుడు 5 పీఠాలు ఉన్నాయి.
కంచి పీఠం ఆచార్యులు జయేంద్ర సరస్వతి ఇప్పుడు హత్యకేసు మీద జైలులో ఉన్నారు. దేశమంతటా పత్రికల్లో ఇదే ఇప్పుడు ప్రధాన వార్త. ఆయన ఆ హత్య చేశారో ..లేదో మనకి తెలీదు.
దేశంలోని చాలా... పత్రికలు, ఇప్పుడు... జయేంద్రని, ఆయనకంటే ముందు ఆ పదవిని అధిష్టించిన చంద్రశేఖర సరస్వతి స్వామితో పోల్చుతున్నాయి. జయేంద్ర కంటే చంద్రశేఖరసరస్వతి ఏవిధంగా మెరుగో విశ్లేషిస్తున్నాయి.
చంద్రశేఖర సరస్వతి ...కుల సమస్య, స్త్రీల సమస్య వంటి విషయాల్లో... కాస్త ఛాందసంగా ఉండేవారు కానీ... ఇలా హత్యలకు తెగబడలేదు.. అని కొందరు మెటికలు విరుస్తున్నారు...
హత్యని సమర్ధించాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ.... మిలియన్ల మంది ప్రజల మనసుల్ని విషపూరితం చేసి, వారికి కులం మీద, బాల్య వివాహాల మీద, స్త్రీల అణచివేత మీద మనసుకి హత్తుకునేలా బోధలు చేయడం కంటే, హత్య అనేది తక్కువ నేరమని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
చంద్రశేఖర సరస్వతి, మీడియా చేత, దేశంలోని ప్రముఖుల చేత సజీవదైవంగా, నడిచే దైవంగా...ఖ్యాతి అందుకున్నారు. అగ్రకుల మీడియాకి ఆయన కౄరత్వం అంత తేలిగ్గా అర్ధం కావడం కష్టం.
అర్ధం కావడం కష్టం.
1994లో అస్తమించేవరకూ చంద్ర శేఖర సరస్వతి - కులవ్యవస్థకి, హిందూ మతంలోని ఇతర దురాచారాలకు - కోట గోడ మాదిరిగా రక్షణగా నిలిచారు.
* భారతీయ విద్యా భవన్‌ వారు చంద్రశేఖర సరస్వతి ప్రవచనాలతో 'హిందూ ధర్మ, ది యూనివర్సల్‌ వే ఆఫ్‌ లైఫ్‌' అనే శీర్షికతో..., 800కి పైగా పుటలతో భారీగ్రంథాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న చంద్రశేఖర సరస్వతి అభిప్రాయాలు చూడండి:
కులమే బలం:
కులం మన బలహీనత కాదని, అదే మన బలమని స్వామి వాదిస్తారు. అంటారు. వేల సంవత్సరాల కాలంలో... ఎన్నో దాడుల్ని తట్టుకుని, ఇతర మతాల సవాళ్ళను తట్టుకుని హిందూ మతం ఇంకా జీవించి ఉన్నదంటే, అందుకు కారణం 'కులమే'నని. చంద్ర శేఖర సరస్వతి నమ్మకం. (చూడండి: హిందూ ధర్మ, పే.56,57)
వేదాలు పుట్టిన 'సప్త సింధు' ప్రాంతంలో...ఇవ్వాళ హిందూమతం తుడిచి పెట్టుకుపోయింది. గాంధార దేశం అని చెప్పబడే ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులు లేరు.
ఆది శంకరులు పీఠం నెలకొల్పిన కాశ్మీర్‌ సంగతేమిటి?
ఇవ్వాళ కాశ్మీర్‌ హిందువుల్లో కులాలు లేవు. ఉన్నది ఒకటే కులం. అదే బ్రాహ్మణ కులం. దీనర్ధం ఏమిటంటే, అక్కడ బ్రాహ్మణులు తప్ప మిగతా కులాల వారందరూ ...మతం మారి పోయారు. బ్రాహ్మణులు మిగిలిపోయారు.
అక్కడే సువిశాల దేశంలో ...అనేక ప్రాంతాల్లో, కింది కులాల వారు హిందూ మతాన్ని విడిచిపెట్టి, బౌద్ధాన్నో, ఇస్లాంనో, క్రైస్తవాన్నో ...ఎంచుకున్నారు. ఇవాళ దళితులు పెద్ద ఎత్తున హిందూ మతాన్ని ఖాళీ చేసి, క్రైస్తవంలోకి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది.
ఇంత జరుగుతున్నా... ఇవాళ ఎవరైనా... ఇసుకలోకి తల దూర్చిన ఉష్ట్ర పక్షి మదిరిగా మాట్లాడుతూ.., కులవ్యవస్థ, హిందూ మతానికి మంచి ఉపకారం చేసిందని నిస్సిగ్గుగా... వాదిస్తుంటే ...ఏంచేయాలి?
8సం.కే ఆడపిల్లలకి పెళ్లి చేయాలి!
అవును. చంద్రశేఖర సరస్వతి వారి అభిప్రాయాలు ఇవే. ఆడపిల్లల్ని, చదివించడం, ఉద్యోగాలకి పంపండం తప్పని స్వామివారి అబిప్రాయం. వాళ్లు తప్పుదారి పడతారని ఆయన ఆందోళన. ఆడదానికి, భర్తే ఈశ్వరుడని, 8సం.లకే పెళ్లి చేస్తే ఆడపిల్ల ఇక ఈ ఈశ్వర ప్రాయుడైన భర్త వద్దే కాళ్లు కడుగుతూ ..పడి ఉంటుందని స్వామి విశ్వాసం. బాల్యవివాహాల వలన, ఆడపిల్లలు ముక్కుపచ్చలారని వయసులో వితంతువులుగా మారుతున్నా, నష్టమేమిటని స్వామి ప్రశ్నిస్తారు. వితంతు పునర్వివాహం ఊసుకూడ స్వామికి గిట్టదు. (చూడండి: 'హిందూధర్మ', పే.578 -597)
స్మృతులు మారవు
మనుస్మృతి తదితర స్మృతుల్లో శూద్రుల పట్ల, స్త్రీల పట్ల ఎంత అమానుషమైన వైఖరి వ్యక్తమైనా... ఆ స్మృతుల్ని అక్షరం కూడా మార్చడానికి వీల్లేదని స్వామి అభిప్రాయం. (అదే పుస్తకం: పే.498)
పుట్టుకతోనే ...కులాలు
భగవద్గీత వంటి గ్రంధాల్లో స్వయంగా శ్రీకృష్ణుడే - వర్ణవ్యవస్థకి గుణ, కర్మలే కారణమని చెప్పినా.. చంద్రశేఖర సరస్వతి స్వామి.. అంగీకరించేందుకు సిద్ధంగా లేరు.
సంస్కరణ వాదుల పైన అయన విరుచుకుపడతారు. పుట్టుకతోనే, కులం సంక్రమిస్తుందని, తాను నిరూపించగలనని స్వామి ఢంకా బజాయించి చెపుతారు. కొన్ని కులాలకు మాత్రమే వేదాధికారం ఉంటుందని, స్వామి చెపుతారు. ఒకరి చేతి వంట మరొకరు తినరాదని, వర్ణాంతర వివాహాలు చేసుకోరాదని చెపుతారు. కులనిర్మూలనకి కృషిచేసే కంటే, దేవాలయాలు పెంచేందుకు కృషి చేస్తే నయమని చెపుతారు. కాళ్లు నెప్పి పుట్టేదాకా, ఊరేగింపుల్లో తిరగడం, గొంతు నొప్పి పుట్టేదాకా అరవడం మానేసి, ఏదైనా పనికొచ్చే పని చేస్తే నయమని స్వామి, కులవ్యతిరేక ఉద్యమకారులకి చెపుతారు. (అదే పుస్తకం: 615- 621, 615 -675)

*. ఈ ముసలి గెడ్డం స్వామి ప్రబోధాల్ని విని, ఎన్ని మిలియన్లమంది, తమ ఆడ పిల్లల్ని చదువుకి, ఉద్యోగాలకి పంపించకుండా ఆపేశారో...., ఎన్ని బాల్య వివాహాలు జరిగాయో.., ఎందరు వితంతువుల జీవితాలు అమానుష ఆచారాలకు బలై పోయాయో..., ఎంతమంది కులవిషాన్ని తమ తలలనిండా తనివితీరా నింపుకుని, తమ జీవితాల్ని, తమకి తటస్థ పడిన వారి జీవితాల్ని నరకంగా మార్చారో.. తలుచుకుంటే, భయం వేప్తోంది! ఒక హత్యకంటే, ఇటువంటి ప్రబోధాలు ఎన్నో లక్షల రెట్లు దారుణమని మన మేధావులకి, మీడియాకి ఎప్పటికైనా... అర్ధమవుతుందా?

*.  అసలు పుట్టుకతోనే... హెచ్చుతగ్గుల కులాలు, సహజంగా వస్తాయని..., బాల్యవివాహాలు చేయాలని, స్త్రీలకి చదువు పనికి రాదని వాదించే, స్వామి మీద కేసుపెట్టి, జైల్లోకి నెట్టాల్సిన అవసరం లేదా? సమానత్వానికి, పౌరహక్కులకి, హామీ ఇచ్చే రాజ్యాంగం అమలులో ఉండగా ...ఈ ముసిలి గెడ్డం స్వామి... మూర్ఖమైన, అమానవీయమైన అభిప్రాయాల్ని, భారతీయ విద్యాభవన్‌ వారు పుస్తకాలు వేసి ఎలా ప్రచారం చేస్తారు? ఇటువంటి పుస్తకాల్ని నిషేధించాల్సిన అవసరం లేదా? ప్రచురణ కర్తల మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా?
తి ఈ చంద్ర శేఖర స్వామి ...ఇంత దారుణంగా ఛాందస విషాన్ని చిమ్ముతుంటే, ఈయన్ని ఎదుర్కొన్న వారెవరూ లేరా? లేకేం ఉన్నారు. స్వామి దయానంద సరస్వతి శిష్యులు పండిత గోపదేవ్‌ - 60ల్లోనే 'శంకర పీఠాధిపతులు - అంటరాని వారు' అనే పుస్తకం రాసి, శంకర పీఠాధిపతి అధికారానికి, అహంకారానికి ప్రత్యక్షంగా సవాల్‌ విసిరారు. (ఇదే గోపదేవ్‌ 'అపశూద్రాధికరణము - శంకర భగవత్పాదులు' అన్న పుస్తకం రాసి, ఆది శంకరులనే ప్రతిభావంతంగా విమర్శించారు.)
*. 'శంకర పీఠాధిపతులు -అంటరాని వారు' గ్రంథం ముగింపులో గోపదేవ్‌ ఈ మాటలు రాశారు:
''....ఈ యంటరానితనమును పోకుండ కాపాడువారెవరు? దీనికి నా సమాధానము బ్రాహ్మణనామధారులు. వారిలో అందరు కాకపోయినను కొందరు పండితులు. శ్రోత్రియులమని చెప్పుకొనువారు ఈయంటరానితనమును శాశ్వతముగా హిందువులలో నాటుకొనియుండునట్లు యత్నించుచునే యున్నారు. ఇక వారి ఆచార్యుల సంగతి చెప్పనక్కరయే లేదు. ఆదిశంకరులు వేదమతము నుద్ధరించుటకు కాపాడుటకు నేర్పరచిన పీఠములు, పీఠాధిపతులు మాత్రము అంటరానితనమును కాపాడుచునే యున్నారు. పీఠాధిపతులు మాలమాదిగలను చూచుటయు దోషావహమందురు. మాలమాదిగలు స్వాములను దర్శింపనర్హులేకారు. ఎప్పుడైన మాలమాదిగలు ఆచార్యులదర్శనము చేసికొనుట సంభవించినపక్షమున ఆచార్యులు ప్రాయశ్చిత్తము చేసికొనువలసిన వారగుదురు. నూర్లకొలది స్నానములు చేసినకాని వారు శుద్ధులు కారు. ఇట్టి నియమాలు కామకోటి పీఠాధిపతులు మిక్కిలిగా పాటింతురనియు అందువలననే వారిలో నెక్కుడు మహత్తు కలదనియు నెందరో చెప్పగా వినుచున్నాము. దీనినిబట్టి చూచిన హిందువులలో అంటరానివారికీ పీఠాధిపతులు మిక్కిలి భయపడుదురని తోచెడివి....
....కామకోటి పీఠాధిపతులు చాల గొప్పవారట. వారు ఎన్నియో ఘన కార్యములను నిర్వహించుచున్నారట. వేదపరిషత్తులు, ఇంకను ఏవేవో పెట్టి వేలకు వేలు ధనము బ్రాహ్మణులకు వేదాధ్యయన సంపన్నులకు నిచ్చి వారి నుద్ధరించుచున్నారట. దానితోనే హిందువులెల్ల రుద్ధరింపబడుదురట. బ్రాహ్మణుల నుద్ధరించుటకు రాత్రింబవళ్ళు పాటుపడు పీఠాధిపతులు అంటరానివారి దుస్థితి నేల విచారింతురు? అంటరాని వారికి పీఠాధిపతులు దర్శనముకూడ నీయక స్వయముగా వారికి దూరులై అంటరానివారై తమ్ముతాము కాపాడు కొనుటలోనే తత్పరులై యుందురు. అంటరానివారు తమ్మును, తాము పూజించు దేవతలను చూచిన తాము తమ దేవతలు మైల బడుదుమని తలంతురు. కాని పీఠాధిపతులెంతో పవిత్రులై నందున వారిని జూచిన వారు పవిత్రులు కావలసియుండ, దానికి విపరీతముగా పవిత్రులే అపవిత్రుల దర్శనమున మైలబడుదురుట. వారి పవిత్రత యెంతదుర్బలమైనదో దీనినిబట్టి తెలియు చున్నది. వారి నేమనగలము? వారు చెప్పినది వేదము; వారాచరించినది ధర్మము.
బ్రాహ్మణులు బ్రాహ్మణ గురువులు నిట్టి యాచార ములను పాటించుచున్నంత వరకు నీ దేశమును హిందువులలో అంటరానితనము దూరము కాదు. హిందువులకు వారే నాయకులు, మార్గదర్శకులును. శ్రేష్ఠజన్ములు మిక్కిలి బుద్ధిమంతులు, విద్యావంతులు, కావున మిగిలిన హిందువులు వారినే అనుసరింతురు.
హిందువులలోని అంటరానితనము పోవలెననిన బ్రాహ్మణులమని చెప్పుకొనువారు కాక మిగిలిన హిందు వులెల్లరునేకము కావలయును. వారిలోగల హెచ్చుతగ్గు భావములను ముందు పోనాడవలెను. బ్రాహ్మణులను వారితో సహాయనిరాకరణము ప్రారంభింపవలయును. బ్రాహ్మణనామధారులకు సంఘములో ప్రస్తుతమున్న గౌరవ మర్యాదలనన్నింటిని త్రోసిపుచ్చవలెను. వారిని సభలలో గౌరవించుట మానవలెను. వారిని తాకిన ఇతరులు మైలబడి నట్లెంచి స్నానాదులనాచరింపవలెను. వారి పౌరోహిత్యము నంగీకరింపరాదు. వారి ఆశీర్వాదములనాశింపరాదు. వారు చూచుచుండగా తామేదియు తినరాదు. దృష్టి స్పర్శ దోషము లను కేవల బ్రాహ్మణ నామధారుల యెడ పాటింపనారం భింపవలెను. ఇట్లు చేయకున్న హిందువులలోనున్న అంటరానితనము రూపుమాయనేరదు. సంఘ శ్రేయస్సుకు, దేశశ్రేయస్సుకు వేరుపురువులుగ నున్న ఈ స్వార్ధపరులకు 'భవతీ భిక్షాం దేహి' అనుటయే శరణ్యమని ఋజువు చేయవలెను. దీనికిదియేమందు.''
రచన .రమణమూర్తి
(ఎడిటర్ విజయవిహారం)



Monday, March 5, 2012

మీ వల్ల నా లైఫ్ నిలబడింది.

''లోకనాథ్ గారు చాల థాంక్స్ సర్... మీ వల్ల నా లైఫ్ నిలబడింది. 70 వేలరూపాయలతో  తోపాటు నా డిగ్రీ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేశారు. ఇక మానాన్న కూడా నన్ను తిట్టడు..మీ మేలు మరువలేను  రేపు మార్నింగ్ మీ ఆఫీసు కి వచ్చి కలుస్తాను"  అంది ఈ  రోజు ఈవినింగ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి..."ఒకే మ్మా... అలాగే రా ".. అని ఫోన్ కట్ చేశాను.ఆ అమ్మాయ్ వాయిస్ లో ఉన్న సంతోషాన్ని మాటల్లో చెప్పడం నాకైతే కాని పని... చాల చాల ఉత్సాహంగా ఉంది  ...భవిష్యత్ మీద భరోసా కనిపించింది... నాకావాయిస్ లో. నాకు చాల గర్వంగా అని పించింది కూడా..అసలు అవుతుందా? కాదా? అని నాలో నేనే మదను పడుతున్న...ఈ మే పని గురించే..

.ఇంతకి విషయం ఏంటంటే... గుంటూరు జిల్లా తణుకు పక్కన ఒక చిన్న పల్లెటురుకి చెందిన దళిత అమ్మాయి..హైదరాబాద్ లో BUSINESS SCHOOL లో  జాయిన్ అవ్వాలని వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ కి కార్ ని పంపి మరి జాయిన్ చేస్కున్న  మేనేజ్మెంట్  ఫీజ్ లేట్ అయిందని ... రాత్రి అనికూడా చూడకుండా..మెడపట్టి బైటకు గెంటివేసి "నీకు దిక్కున దగ్గరకి పోయి చెప్పుకో.. బాలెన్సు ఫీజ్ తెస్తేనే రా లేకుంటే..వెళ్ళిపో"  అని నిర్దయగా పంపేస్తే .. చేతిలో చిల్లి గవ్వకుడా లేకుండా..ఆ రాత్రి పూట హాస్టల్ బైట పడ్డది..ఎక్కడికని వెళ్లగలుగుతుంది..ఆ చీకట్లో..  అప్పుడు సకల జనుల సమ్మె కుడా జరుగుతుంది పాపం  ... ఎక్కడికైనా వెళ్దామంటే కనీసం ఆ ఏరియాలో మాములుగానే ఏ వాహనాలు రావు ఇక సకల జనుల సమ్మె జరుగుతుంది అంటే చూడండి పరస్థితి ఎంత నరకమో.?? నిన్న తను ఏడుస్తూ చెబుతుంది.." రైల్వే స్టేషన్ లో పడుకున్నా సర్" ...అని ఒక్కసారిగా బిక్కరగా ఏడ్చేసింది.. ఓదార్చడం మా వాళ్ళ కాల. ..  ఏ అల్లరిమూక ఉన్మాద మూక కంట్లో పడుంటే..అనే ఆలోచన రాగానే నా గుండె నీరై పోయింది..అయ్యే ఒక అమ్మాయికి ఎంత కష్టమొచ్చిందో కదా..అని వింటున్న మేము కన్నీళ్లను ఆపుకోలేకపోయాం.    ఆ కాలేజ్  మానేజ్ మెంట్ మీదే కాదు..సకల జనుల సమ్మె మీద ఒక్కసారిగా కోపం, ఆవేశం తన్నుకొచ్చాయి.....  సరేలేమ్మా ... ఏడవకు..మేమున్నాం కదా......ఏడవకు మేమున్నాం  ఇక వదిలేయ్ ... అన్నా వోదార్పుగా .. వాళ్ళ నాన్న కూడా ఏడుపు ఆపుకోలేకున్నాడు... కాసేపటికి     కాస్త శాంతించి .. అసలు విషయం చెప్పడం ప్రారంబించింది...

" సర్  RATAN GLOBAL BUSINESS SCHOOL వాళ్ళు మా గుంటూరు లో PGDM కోర్స్ కి ఎంట్రన్స్ పెడితే వెళ్లి వ్రాశాను  .. ర్యాంక్ వచ్చింది..2years కి 5లక్షలు అవుతుందంటే...అంత నా వాళ్ళ కాదు సర్  .. నేను ఇక్కడే C.A జాయిన్ అవుతాను అంటే... "భలేవారే మీరు అసలు ఏం కట్టక్కరలేదు..మొత్తం ICICI bank వాళ్ళే లోన్ ఇస్తారు...మేమే ప్లేస్ మెంట్ కూడా చూపిస్తాం .. తర్వాత బ్యాంకు వాళ్ళే లోన్ అమోంట్ కట్ చేస్కుంటారు .. సో మీకు నో ప్రాబ్లం... అన్నారండి..ఇప్పుడు మొదటివిడతగా 50,వేలు కట్టమాన్నరండి.. నెక్స్ట్ 70,వేలు తర్వాత 10,వేలు ఇంకో 20,వేలు మొత్తం 1.30 లక్షలు..కట్టాలని టార్చర్ పెట్టారు సార్ అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ..నాకు "మనం ఎలాగైనా ఈ విషయంలో ఫైట్ చేయాలనిపించింది.."   కూలిచేస్కునే కుటుంబం నుండి అంత మొత్తాన్ని గుంజిన కాలేజ్ యాజమాన్యం..       ఇంతకి అక్కడ నడుపుతున్నది అంతా బోగస్ కాలేజ్ అని తేలింది.. క్లాసు లు అసలు జరగవు .. స్టూడెంట్స్ ఉన్నది forty members మెంబర్స్ మాత్రమే.. స్టాఫ్  founder president Dr.B RATAN REDDY అతని వైఫ్, వాచ్ మెన్, మెస్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండరు..ఇంతా చేసి ఆ యాజమాన్యం ఇచ్చే సర్టిఫికేట్ నాలుక గిసుకోను కూడా పనికి రాదనీ అంతకుముందు అక్కడ చదివిన  సీనియర్స్ చెప్తే ... అవాక్కవ్వడం  మావంతైంది...

                           సరే...ఇంతకి..మా సంస్థ నుండి ఆజాద్,రాజేష్ , సుధాకర్, ఇమ్మయ్య, ఎస్ ఎస్ రావు లను పంపి నేను ఆఫీసు నుండే విషయం వాకబు చేస్తూ ..అర్ధ గంటకోకమారు కాల్స్ మాట్లాడుతూ టచ్ లో ఉంటున్నాను..ఒక వేళ అక్కడ ఏమైనా గొడవ పెద్దదిగా జరిగితే బైటుంది మానేజ్ చేయాలనీ నేను ఈ ఆపరేషన్ లో ప్రత్యక్షంగా ఇన్న్వాల్  కాలేదు..మా వాళ్ళు వెళ్లి అడిగితె...మొదట కాస్త బెట్టు చూపించినా..మావాళ్ళ కమిట్ మెంట్ కి జడిసి..70 వేలకి చెక్కు..సర్టిఫికెట్స్ ఇవ్వక తప్పింది కాదు...ఆ బోగస్ కాలేజికి ...ఇందులో కొసమెరుపు ఏంటంటే...వెళ్ళిన   వాళ్ళలో ఒకతన్ని పిలిచి నీకు 10  వెలుఇస్తాము..కాస్త సర్దుకుపొండి..అని RATAN GLOBAL BUSINESS SCHOOL వాళ్ళు.మా వాళ్లతో  బిజినెస్ మాట్లాడాడంట, చుసారటండి వాడి బుద్ది ఇక్కడకూడా వాడు బిజినెస్ వదలటం లేదు..


ఈ పోస్ట్ రాద్దామని డిసైడ్ అయ్యాక ఆ అమ్మాయి కి ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం ఇంతకి ఆ జఫ్ఫా గాడిచ్చిన చెక్ పాస్ ఐందా లేదా అని...  ఆ అమ్మాయి అంది కదా.." హా పాస్ అయిందండీ..మీకు ఇమ్మని 5000  ఇచ్చానే .. ఎస్ ఎస్ రావు కి ఇవ్వలేదా?? " అంది..స్టైలుగా  ఆ..  హా..!! తల్లి .. మేం నికేలా కనిపిస్తున్నాం తల్లి..డబ్బులు తీస్కుని  దాదా గిరి చేసేవాళ్ళలా కనిపిస్తున్నామా తల్లి...నమస్కారం మ్మా..తల్లి..నువ్ భలేగుండావ్ గదా తల్లా..అని నా మనసులోనే నేను అనుకున్నా.." పైకి .."అరె అలా ఎందుకు చేశావమ్మ ..మాకు డబ్బులెందుకమ్మా.. నీ సమస్య నుండి ..నువ్ బైట పడి నీ సర్టిఫికెట్స్ నీకు చేరాలనే మా కోరిక తపన అంతేకాని డబ్బులు కోసం కాదు ..ఎనీవే నీకు ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇంకా మీ డాడీ పొలం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు చేతికందాయ్ సో..నువ్ హ్యాపీ మేము డబుల్ హ్యాపీ..బాయ్..తల్లి..అని పెట్టేశా.. ఇదన్నమాట విషయం.





Wednesday, February 15, 2012

చాల గొప్పవాడు??????

"నాధూరాం గాడ్సే చాల గొప్పవాడు .. ఎంతటి గొప్ప వాడంటే...ఆ .. ఆ .. ఆ ఎలా చెప్పాలబ్బా... ఆ.. ఆ గాంధీ అంత గొప్పవాడు." ఛీ ఒక ఉన్మాది ప్రేలపనలో కూడా నిబద్దత ని వెతికే కవులు .. మేథావులు ఉన్నారు ... ఇంకేం మన వాదనని వ్యతిరేకించే వాళ్ళ నందరిని చంపుకుంటూ పొతే పోలా?

కొందరు త్యాగం చేయాలి! నశించాలి!


కొందరు త్యాగం చేయాలి!
నశించాలి!
నాశానమైపోవాలి!
అప్పుడే కాని దేశం బాగుపడదు!
ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?
"మాకొద్దీ తెల్ల దొరతనం " అనే పాటతో స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని ఉరకలేత్తించిన వాడు... తను కలుగన్న స్వతంత్రం సిద్దించాకా మద్రాసు లో భిక్షాటన చేస్తూ ..ఒక కన్ను సైతం కోల్పోయి ... పక్షవాతంతో ...1952 డిసెంబర్ 18 న కన్నుమూసిన .. గరిమెళ్ళ సత్యనారాయణ అనే ఒక దేశ భక్తుడు..నీకు ....నాకు...యావత్ దేశానికి స్వేఛ్చ స్వతంత్రాన్ని సాదించడానికి సమస్త జీవితాన్నిఅర్పించిన ధీశాలి...
ఈ రోజున నువ్ పుజించకున్న పర్లేదు... కానీ మిత్రమా ... అవమానించకు..నిను వెలిగించటానికి ఆరిపోయిన జీవితాలెన్నో వోసారి ఆలోచించు..

Sunday, November 20, 2011

నీ రూపాన్నే...

వెలసిన ఈ చిత్రాలన్నీ
నీ చూపులకోసం తపించినవే..
మొగబోయిన ఈ గొంతు పాడింది
నీ పాటలనే
దైన్యం నిండిన ఈ కళ్ళు తడమాలనుకున్నది
నీ రూపాన్నే...

ఎన్ని రోజులో

ఎన్ని రోజులో
ఈ ఎడారి
పయనం
జ్ఞాపకాల అలజడికి
జడిసిన నా హృదయం
ఇపుడు ఆగిని నాకు చింత లేదు
ఎందుకంటే
నీలో చిగురించి
పూయిస్తుందనే.....

Friday, November 18, 2011

రావా ఒక ఉప్పెనలా!

ఎలా ఉన్నావ్?
నీరు లేని సముద్రంలా..
జాబిల్లి లేని ఆకాశంలా..
ప్రతిమ లేని గుడిలా..
నువ్వు లేని నేనులా..ఉన్నావా..???

నీటి చుక్కకు అంగలార్చే
చివురు టాకుల ఉన్నాను
గొంతెండిన ఎడారి
బాటసారిలా ఉన్నాను...
పుష్పించని మొక్కలా ఉన్నాను.
కోయిల గొంతులో మార్ధవ్యాన్ని
గ్రోలలేని అచేతన లో ఉన్నాను..
రావా ఒక ఉప్పెనలా
కుచించుకు పోతున్న
ఈ ప్రపంచం నుండి
నీ లోకంలోకి తిసుకేల్లవు..??

Monday, October 10, 2011

క్షమ వీరస్య భూషణం.

క్షమ వీరస్య భూషణం.
...ఒకవేళ పిరికితనానికి, హింసకి మధ్య ఎంపిక ఉండే పక్షంలో .. నేను హింసనే పాటించమనే చెపుతానని నానమ్మకం. 1908 లో నేను అత్యంత దారుణమైన దాడికి గురైన విషమసమయంలో , అక్కడ ఉండి ఉంటె ... తాను ఏం చేసి ఉండాల్సిందని నా పెద్ద కొడుకు నన్ను అడిగాడు. నేను చస్తుంటే వదిలేసి ... అక్కణ్ణించి పారిపోవాల లేక తాను కోరుకుంటున్నట్టు బలాన్ని ప్రయోగించి .. నన్ను నేను రక్షించాలా. హింసని ప్రయోగించిన సరే .. నన్ను రక్షించడమే తన ధర్మమని నేను అతనికి  చెప్పాను.
   ...తన గౌరవానికి భంగం కలిగేటప్పుడు పిరికితనంతో , నిస్సహాయమైన సాక్షిగా.. మారడం లేదా మిగలడం కంటే, తన గౌరవం కాపాడుకోవడానికి భారత దేశం ఆయుధాలు చేపట్టాలనే నేను భావిస్తాను.
ఐతే హింస కంటే  అహింస మహోన్నత మైనదని నా విశ్వాశం. క్షమ అనేది శిక్ష కంటే పౌరుషమైనదని నా నమ్మకం.  క్షమ వీరస్య భూషణం ( క్షమ అనేది వీరుడికి అలంకారం). శిక్షించే సామర్ద్యం ఉన్నప్పుడే ... వదిలి పెట్టడం క్షమ అనిపించు కుంటుంది. నిస్సహామైన ప్రాణి క్షమించినట్టు నటించడం అర్ధం లేనిది. పిల్లి చేతిలో ... ముక్కలు ముక్కలుగా చీల్చి చంపబడే ఎలుక, ఆ పిల్లిని ఎలా క్షమించగలదు. ఐతే భారతదేశం నిస్సహామైనదని నేను భావించటం లేదు. నన్ను కూడా నేను నిస్సహామైన ప్రాణి అనుకోను. నా శక్తినీ, భారత దేశపు శక్తినీ కూడా మరింత మంచి ప్రయోజనానికి వినియోగించాలని నేను భావిస్తున్నాను. నన్ను అపార్ధం చేసుకోవద్దు. బలం అనేది భౌతిక సామర్ద్యం నుంచి రాదు. అది అజేయమైన సంకల్పం నుండి వస్తుంది.
  ... భారత దేశంలో నూరు వేలమంది ఇంగ్లిషువాళ్ళు మూడు వందల మిలియన్ల ప్రజానీకాన్ని భయపెట్టనవసరం లేదని, మనం అర్ధం చేసుకుంటే సరిపోతుంది. కచ్చితమైన క్షమ అంటే అర్ధం మన బలాన్ని గురించి కచ్చితమైన ఎరుక అనే. వికసిత క్షమ నుంచి .. మహత్తర శక్తి తరంగం మనలో ప్రవేశిస్తుంది. ఇక్కడ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పలేక పోతుండటం పట్ల నాకు అంత పట్టింపు లేదు. ఆగ్రహం, ప్రతికారేచ్చలను జయించడానికి, మనకి శక్తి లేనట్టుగా , మనం అధః పాతాళంలో ఉన్న్నట్టుగా భావించుకుంటున్నాం. శిక్షించే హక్కును  త్యజించడం ద్వారా భారతదేశం సాధించేదేంతో వున్నదని, నేను చెప్పితీరాలి. మనం చేయడానికి ఎంతో మెరుగైన పని ఉంది. ప్రపంచానికి మహత్తరమైన కార్యాన్ని చేసి చుపాల్సిఉంది.
     నేను దార్శికుడిని కాను. నేను ఆచరణాత్మక ఆదర్శవాదిని. అహింసామతం అనేది ఎవరో ఋషులకో, ప్రవక్తలకో కాదు. అది సామాన్య ప్రజానికానికి కూడా. అహింస అనేది మానవధర్మం. హింస అనేది మృగధర్మం.
   ...అందుచేత నేను, అత్యంత పురాతనమైన ఆత్మత్యాగ ధర్మాన్ని భారత దేశం ముందు ఉంచుతున్నాను. సత్యాగ్రహం కానివ్వండి, దాని కొమ్మలైన సహాయ నిరాకరణ, పౌర ప్రతిఘటన అనేవి కానివ్వండి... ఇవి కొత్తవేమీ కావు, బాధని ఓర్చుకోవడమనే ధర్మానికి కొత్త పేర్లు మాత్రమే. హింస కల్లోలాల మధ్య అహింసాధర్మాన్ని కనుగొన్న ఋషులు ఎవరైతే ఉన్నారో..వారు న్యూటన్ కంటే మేధా సంపన్నులు. వారు వెల్లింగ్ టన్ కంటే మహా యోధులు. ఆయుధాల ఉపయోగం స్వయంగా తెలిసిఉండీ, వాటి నిరుపయోగాత్వాన్ని అవగాహన చేసుకున్నారు. దస్సిపోయిన ప్రపంచానికి విముక్తి, అహింస ద్వారానే కానీ హింస ద్వార రాదని వారు భోదించారు.
     గతిశీలమైన స్థితి లో ఉన్న అహింసకు అర్ధం ఎరుకతో బాధల్ని ఓర్చుకోవదమనే, ఆహిస అంటే, చెడు చేసే మనిషి దుష్ట సంకల్పం ముందు సాగిలపడటమని అర్ధం కాదు. ఒక పీడకుడి దుష్ట సంకల్పానికి ప్రతిగా, తన ఆత్మని మొత్తం బరిలోకి నిలపడమే ఆహింస అంటే. మన ఉనికికి సంబంధించిన ఈ నియమానికి బద్దులమై పనిచేసేటప్పుడు, తన గౌరవాన్ని, తన ధర్మాన్ని, తన ఆత్మని కాపాడుకోడానికి.. ఒక అధర్మ సామ్రాజ్య శక్తిని ధిక్కరించడం, దాని పతనానికి, లేదా పునర్నిర్మాణానికి పునాది వేయడం, ఒక ఒంటరి వ్యక్తికైనా సాధ్యమే అవుతుంది.
భారత దేశం బలహీనంగా వున్నది కాబట్టి ... అహింసని పాటించమని నేను వాదించడం లేదు. భారత దేశం తన శక్తి పట్ల, సామరస్యం పట్ల, ఎరుకతో అహింసని  పాటించాలని నేను కోరుతున్నాను.
''భారత దేశం బలహినంగా వున్నది కాబట్టి..ఆహింసని పాటించమని నేను వాదించడం లేదు.భారత దేశం తన శక్తి పట్ల,సామర్థ్యం పట్ల ఎరుకతో ఆహింసని పాటించాలని నేను కోరుతున్నాను.తన శక్తిని గుర్తించడానికి..,తనకి ఎటువంటి ఆయుధ  శిక్షని

అవసరమని ఎందుకనిపిస్తోందంటే, మనని కేవలం మాంసపు ముద్దలుగానే మనం భావింకోవడం వల్లనే,అని అనిపిస్తోంది.తనకి ఆత్మ ఉన్నదని..భరత దేశం గుర్తించాలి.ఆ ఆత్మ ఎన్నటికి నశించదని,భౌతికమైన బలహీనతలన్నింటిని అధిగమించి ..విజేతగా ఉదయించగలదనీ,యావ                భౌతిక శక్తినీ దిక్కరించగలదనీ అర్థం చేసుకోవాలి.ఆచరణ వాదిని కాబట్టి,రాజకీయ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనానికి ఉన్న ఆచరణాత్మకతను భారతదేశం గుర్తించేంత వరకూ నేను   వేచివుండలేను.
ఇంగ్లీషు వాళ్ళు మర తుపాకుల ముందు,టాంకుల ముందు,విమానాల  ముందు..భారత దేశం తనకి తాను బలహినురాలిగా,నిర్వీర్యురాలిగా భావించుకుంటోంది.బలహీనత నుంచే..తాను 'సహాయ నిరాకరణ 'పాటిస్తోంది.అయినప్పటికీ అది ఫలితా మిచేదే.'సహాయ నిరాకరణ'ను తగినంత మంది పాటిస్తే అది,ఎముకల్ని పిండిచేసే ...బ్రిటిష్ అధర్మ పాలన భారం నుంచి దేశాన్ని విముక్తి చేసేదే.భారత దేశం ఖడ్గధర్మాన్ని పాటిస్తే.తాత్కాలిక విజయాన్ని సాదింవచ్చు.అప్పుడు భారత దేశం నా హృదయాన్ని గర్వకారణం కాకుండా పోతుంది.నేను భారత దేశానికి కట్టుబడ్డాను.ఎందుకంటే,నా సర్వమూ ఆమె నుంచి వచ్చిందే .ఆమె ప్రపంచానికి సాధించి చూపాల్సిన కార్యం వున్నదని...నేను అక్కడ లేనట్టుగా కాకూడదని ఆశిస్తున్నాను.నా మతానికి ఎటువంటి భౌగోళికమైన సరిహద్దులూ లేవు.దానిపై నావిశ్వాసం సజివమైనదైతే...,అది భారత దేశం పైన భారతదేశం పైన నాకున్న ప్రేమను గెలిచేలా చేస్తుంది. yavathprapamcham  
                                                                                                                                                                                                              -మహాత్మా గాంధీ
[1920 లో గాంధీజీ వ్రాసిన సుప్రసిద్ధ వ్యాసం 'డక్ర్టిన్ ఆఫ్ స్వర్డ్ 'నుంచి ]

Saturday, July 9, 2011

పోదాం పద


పోదాం పద ఆ అడువుల్లోకి
ఎక్కడ రాలే హేమంత పత్రాల మీద
సూర్యుడు మనిషికోసం
సందేశాలు రాస్తున్నాడో
ఆ అడువుల్లోకి -

Tuesday, June 28, 2011

నా కవిత్వం కేవలం మనిషికి డిఫెన్స్!- శేషేంద్ర

ఎక్కడ కేంపులోలికే కెమిలియాలు నిశ్శబ్ద
మాదురిమలో
నీలి నీలి కలలు కంటున్నాయో
ఎక్కడ చెట్లు యౌవనపు ఆకుల్ని
రాలుస్తున్నాయో
భూమి నాగరికతల్ని రాల్చినట్టు ,
ఆయూక లిప్టస్ అడవుల్లో పరుగిదదాంపద-

* * *

పోదాం పద ఆ అడువుల్లోకి
ఎక్కడ రాలే హేమంత పత్రాల మీద
సూర్యుడు మనిషికోసం
సందేశాలు రాస్తున్నాడో
ఆ అడువుల్లోకి -
* * *

ఆకాశం విసిరే పిడుగులకు
అడ్డం లేదు
నా వాక్యాలకు కాపలా లేదు
అరే అవి జూ నుంచి తప్పించుకున్న
సింహాలు
మనుషుల మీదకి దూకే
భయంకర ఓనమాలు

* * *

చంపి కొండల్లో పారేశిన వాడి శరీరం
రాగం కోసం బిగించిన ఫిడేలులా పడి వుంది
వాడినోరు పాడిన పాటలు
ప్రవహించే నదులు ఆగి ఆలకించేవి
చావులేని వాడ్ని చంపిన మూర్ఖులకు
తెలీదు
ఏ మృత్తిక పువ్వును మనిషికి కానుకగా
ఇచ్చిందో అది వాడి నిర్మాణంలో ఉందని
* * *

కోకిల పుస్తకాల నుంచి పారిపోయి
కొమ్మ ఎక్కిన గాన సామ్రాట్టు
చంద్రుడు ప్రణయాగ్నుల్లో కాల్చిన
పెసరట్టు
* * *

ఎవడు ఏడవగలడు
మరోకడికోసం!
అంతశక్తి ఎవడి కుంది
నీ కోసం ఏడ్చే వాడికి
నీవు ఋణగ్రస్తుడివి
మార్క్స్ కు ఈ శతాబ్దపు
అన్నార్తులందరూ
ఋణ గ్రస్తులు
* * *

వాడు ఎందుకు చస్తున్నాడనుకున్నావ్
ఆ అడవుల్లో అన్ని గాయాలతో-
వాడు ఎందుకు మరణిస్తున్నాడు!
ఎందుకంటే
వాడికి ఇవ్వబడిన ఆయుస్సు చాలదు
నూరేళ్ళకు బదులు వెయ్యేళ్ళు కావలి
మందులతో రాదు అమరత్వం
మరణంతో వస్తుంది
* * *





శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు
ఒక మధు పాత్రలా
అతడు కవి అయి వుంటాడు
ఒక గీతికతో ఈ వసంతరుతువుకు
ప్రారంభోత్సవం చేసిందెవరు
అది కోకిల అయి ఉంటుంది
సూర్యుడు దున్నుకుంటూ వస్తాడు
మన ప్రాతఃకాల స్వప్నంలోకి
నక్షత్రంలా నగ్నమైన ఆమె తనువూ
చేపలా వస్తుంది
నా అరచేతిలోకి-
* * *

కొండలు కొండలే చేధిస్తున్నారు
అరే నీళ్ళ నెంత భాదిస్తున్నారు
డాములు కట్టి కాలువలు త్రవ్వి
ఆకలి తరపున సృష్టితోనే వాదిస్తున్నారు

* * *

సముద్రమైన మనిషిలో నుంచి
సత్యం ఎండిపోవడం చూస్తే
ధరిత్రి మీద
సముద్రాలూ ఎండిపోతాయని
భయమేస్తుంది
పర్వతాలు పారిపోతాయని
భయమేస్తుంది
వృక్షాలు పుష్పవతులై నడిచే రోజు
రాదని భయమేస్తుంది


* * *

మెదడు లేని క్యాబేజీ వాడి తల
నగరాల్లో ఉన్న కాలేజి వాడి వల
వాడు బంగాళాఖాతంలా నోరు
తెరచి ఆవులిస్తాడు
మాటల చెత్త కుప్పలు సృష్టిస్తాడు
త్రవ్వగా త్రవ్వగా
మొహంజోదారోలో కుండపెంకులా
వాడి పుస్తకాల దిబ్బల్లో
ఎక్కడో ఒక పోయెం-
* * *


జీవన భాషలో చెట్టు ఒక
ఛాయామయ విరామం
ఎక్కడ చేరి పక్షులు మనుష్యులు
నిశబ్దాలై కలలు కంటారో-
దాన్ని విరిచి గొడ్డలి చేయకు
దాన్ని ఉరికంబం చేయకు
దేశపు వీరత్వాన్ని దానికి వేలాడదీయకు

* * *

జీవించిన వాడు పళ్ళుగా ధాన్యంగా
మారిన భూమిని తింటాడు
మరణించిన వాడు
వట్టి భూమినే తింటాడు

* * *


ఏ నక్షత్రం కోసం
నిరీక్షిస్తూ
నా పాటలన్నీ పాడేనో
అది ఈ దేశం మీద
ఉదయించనే లేదు
ఎగిరి పోయింది
మా వయస్సు మాత్రం
వాలి పోయిన ఆకాశంలో
ఒక పక్షిలా-
* * *

అరే ఈ కోకిలలు పాడుతున్నాయే
వాటికి మా కన్నీళ్ళు కనిపించవా ఏమిటి!
ఒంటి మీద వసంతం పూసుకున్న వాడికి
గుండెల్లో జీవన పోరాటాలు ఉండవాఏమిటి!
* * *

మీకు కావాలి
పుస్తకాల్లో ఉండే చంద్రుడూ
ఆకాశమూ
కారణం మీ భవనాలూ
మిమ్మల్ని ఆకాశం నుంచి
విడదీశాయి
చలికాలంలో కూడా
చందమామ ఆకాశము
మాతో కలిసే ఉంటాయి
చలికి చనిపోయిన మా పిల్లలు
చంద్రలోకం వెళ్లి ఆడుకుంటారు
* * *




ఎవడి చేతనలో విమాన దాడులు
జరుగుతాయో
నగరాల భారీ గోడలు
బాంబుల వర్షాల్లో కూలుతాయో
సైన్యాల బూట్లు ఎవడి జీవన పేజీలమీద
నడుస్తాయో
దేశాల ఇనపతీగెలు చెల్లాచెదరై పోతాయో
ఎవడి గుండెల్లో
మానవ రక్తం గొంతులెత్తి విలపిస్తుందో
ఎవడి మెదడులో నక్షత్రం బ్రద్దలౌతుందో
వాడే పద్యాల పితామహుడు-
* * *

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కుర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు
నేనింత పిడికిడు మట్టె కావొచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండా కున్నంత పొగరుంది
* * *

నవ్వు మొహాన రాశిన వాళ్ళని చూస్తే
నా చెయ్యి బాంబు కోసం వెతుకుతుంది
వాళ్లకు నవ్వేంతటి సుఖం ఎలా దొరికింది
ఈ దేశంలో:
ఈ దేశంలో వంగే వాడికి
వంగి సలాం చేసే వాడు పుడుతున్నాడు
జాగ్రత్త:
ఈ లక్షణం తల యేత్తిందంటే
ఆకాశంలో తోక చుక్క పుట్టిందన్నమాటే

* * *
నా అవయవాలకు నీచంగా వంగే
భంగిమలు తెలీవు - నేను సత్రగ్రహిని
నా కశ్మల శరీరాన్ని దగ్ధం చేసుకుని
తప్త హిరణ్య ద్రవంగా ప్రవహిస్తున్నాను
నా దేశపు రహదారుల్లో -
రండి నాతో కలిశి.

Wednesday, June 22, 2011

నామిని నిజంగానే పుడింగే (పుస్తకం.నెట్ లో జంపాల గారి సమీక్షకు నా స్పందన )

ఏ గొప్ప ఆదర్శాల గురించి నామిని ఎప్పుడు  మాట్లాడలేదు ఏ కథలోనూ తను పాటకుల మీద పెమానం చేసి "నేను నూటికి ఇన్నూరు శాతం సత్తె పెమనికంగా సెప్తుండా నేను   సత్తె అరిచ్చేన్ద్రుడ్ని అని రోమ్మిరుస్కుని నిలబడింది లా.    
                                                     నా నంగి చేష్టలు, నా జుటాతనాలు, నా లోబి తనాలు,నా తాగుబోతు బుద్ధి, నా దొంగతనాలు అని తను వొంగొంగి దణ్ణాలు పెట్టుకున్న సందర్బాల గురించి సూళ్ళురుపేట, రాజంపేట లో తనని నలగోట్టిన సంగతిని  రాసుకున్నాడు గాని నిక్క నీలుక్కుని బిర్ర బిగుసుకుని ఫోటోకి ఫోజిచ్చుకోల కదా   ఇంకా ప్రముఖ రచియిత వంశి తన "పసల పూడి పులిసిన పులుసుని" నాలికి మిందేస్కుని అ టేస్ట్ మింద ఒక టెక్స్ట్ మెస్సేజ్ పంపమని  సేత పోరిన నామిని కలం యవన్న వొంగిదా?
బాపు చేత ఫోన్ చేయిస్తే  మాత్రం బాపు కాదు వాళ్ళ  బాబు చెప్పిన మరి నామిని అంటే మొగాలయే కదా  మళ్ళా రెకమండేషన్లు అంటే మా వోడికి అరికాలు మంట నేత్తికేక్కధ మరి. (ఇల్లేరమ్మ కథలేసినాడంటే కుసింత అర్ధం ఉండాదప్ప సుసీలమ్మ పైగా నువ్వే నా గురువంది ఐన ఈ కేడి నాయాలు తన పేరుని మాత్రం యేస్కోనీల కద అ యమ్మ పుస్తకంలో) నామిని కల్పనా సాహిత్యం రాయలేడు అని ఒక విసురు కల్పనా సాహిత్యం అందురు ఎలాగబెడతాఉండారుగదా ఏందీ భూమి పుట్టినప్పట్నుండీ ...

ఇట్ట ఇలావరిగా పక్కకు పిల్చుకేల్లి నా ఒక్కడితోనే తోనే మాట్లాడతున్నట్టు ఎవోక్కడు అన్న మనకు చెప్పినాడ కథలు  అని.. శైలి కంటే వస్తువే ముఖ్యమా? ఇప్పటిదాకా తెలుంగు సాహిత్యం తన చూపులు సారించని వస్తువులు ఉన్నాయా జంపాల  గారు? అయిన నామిని ని మీరుగాని నేనుగాని తన బుక్స్ ఇష్టంగా చదివే వారందరూ నచ్చేది తన శైలినే కదా? అచ్చరం పొల్లుబోకుండా కయ్యిల్లో ఊర్లల్లో  అచ్చరం మొకం చూడని వాళ్ళు మాట్లాడే మాటల్ని అచ్చులోకి దింపిన విలేజ్ బెమ్మ కదా సా.  నామినంటే.

         ఉడికాయో లేదో అని వేడి వేడి అవుర్లోంచి ఎత్తుకు తిన్న వేరు శేనక్కాయలా  లేవ?లేత తాటి ముంజులలో నీళ్ళ ను జుర్రుకుని ముంజుని తిన్నట్టులేదా దాని చుట్టూ ఉన్న వొగరు తపక ని ఉసేసినట్టే  జ్యోతి లో తప్పుడు లెక్కలు సుసీలమ్మ కంప్యూటర్ సంగతిని ఉసేసి సామాన్యుడి ఆనందాన్ని ఆస్వాదించండి సా. నామిని లాంటి సేతురోడు లేని ఊరు ఊరే కాదని నా ఇన్నపం.

కథంటే సేప్పినట్టు ఉండాలే కానీ రాసినట్టే ఉండకూడదనే మాట తెలుగచ్చరం పోయేదాకా నిలబడే మొగలాయ్ మాట కదా..ఇప్పటి దాక యేన కొడుకు సేప్పినాడో ఇంత నికార్సుగా.." అ గుడిసెలో కిరసనాయులు దీపం ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయి పోయిన పదో తరగతి కుర్రాడిలా బిక్కు బిక్కు మంటోంది"... అన్న పోలికని మనోడు ఎదిరించి నాడంటే నాకెంత సంతోషమో మాటల కందట్లేదురా నాయనలారా అమ్మలారా..కాకపోతే కిరసనాయులు దీపం కి తగులుకుని ప్రాణం కోటకలాడతున్న  రెక్కలున్న ఏ పురుగో దోమో ఈగో  అని రాయొచ్చు కద.  రావి శాస్త్రి , కేశవరెడ్డి మింద నామిని విసుర్లకి నాకు శాన కులుగ్గానే ఉండాది..హాయిగా వల్లిరుసుకుని అవులించినట్టే...... నామిని ఈ రోజున కోత్తగా అర్ధం అవడం ఏంటో నాకు పూర భోదపడట్ల..పచ్చనాకు సాక్షి గా చదివిన బుర్రున్న పెతోడికి యిట్టె తెలిసి పోవల్న్నే కానీ తెలియకపోతే మళ్ళ ఇకొక తురి చదవాలా.నామిని రాసిన కతలు అనేకంటే సెప్పె కతలంటేనే మరేద నాకు వాళ్ళమ్మతో కలిసి చేసిన జుటా పనులు జూస్తే తెలిద అని  వీళ్ళకి అని నాకు ఒకటే ఆచ్చేర్యంగ మనోఎద గా ఉండాదప్ప ..........  
నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది అదేంటంటే నేను చెప్పుల్లేకుండా మట్టిలో ఓ అంట ఆడుకుంటూ దుమ్ములో కాలితో నాగల్లగా దున్నుకుంటా పోతుంటే రుపాయి బిళ్ళలు వచ్చేవి అట్టా ఎన్ని గేలకత ఉంటె అన్ని.. ఈ రకంగా ఎవురికన్నా డాలర్లు  దొరకతా ఉండయనుకునే అడిగాడేమో ఐన ఎన్జీ ఓ లు  జెపి కంటే పిల్లలో జీకే పెంచుతాననే నామినే బెటర్ కద .....ఛా..నాశినం ఈ మాటగూడ నాతో చెప్పించాల ఏందీ..

Tuesday, May 17, 2011

నా మాటలు

వరిపైరులో కలుపు మొక్కలని పెరకి వేసేటప్పుడు
వరిమొక్క వేర్లు కొన్ని తెగుతాయ్
అలానే నా మాటలు
నీకు కొంత భాదను కలిగిస్తాయ్
అంత మాత్రాన నేను కలుపు మొక్కను పీకకుండా ఉండలేను..
ఎందుకంటే నువ్ ఆరు వదంతుల  గాను
నూరంతలుగాను  పండలనే నాకోరిక...