Tuesday, June 12, 2018

మతం వేరు - మతోన్మాదం వేరు


మతోన్మాద సంస్థలు మతాన్ని స్వంతం చేసుకుని మాట్లాడుతుంటాయి. ఆశ్చర్యమేమిటంటే ఒక్కోసారి లౌకికవాదులని చెప్పుకునేవారు సైతం మతోన్మాదులని విమర్శంచే పనిలో మొత్తంగా మతాల్ని విమర్శించేస్తుంటారు.
హిందూ మతమో,ఇస్లామో , క్రైస్తవమో, బౌద్దమో... ఏదైన కానీ .. ప్రపంచంలో ఏదైన ఒక మతాన్ని అనుసరిస్తూ ఆస్తికులుగా ఉన్న జనాభానే అత్యధికం. మరి మతానికీ, మతోన్మాదానికీ తేడా లేక పోతే ప్రపంచంలోని ఆస్తిక జనాభా అంతా మతోన్మాదులే కావాలి.
ఈ ధోరణి తప్పు అని చెప్పడానికి పెద్ద చర్చ అవసరంలేదు. మతాన్ని అనుసరించే ప్రజలంతా మతోన్మాదులు కారు.
మతాన్ని, మతోన్మాదాన్ని వేరు చేసి మాట్లాడాలి. మతోన్మాదుల్ని ఒంటరిని చేయాలి. మతోన్మాదుల స్వరాలు మతాలకు డబ్బింగ్ చెప్పనీయరాదు. మతవేదికల నుంచి మతోన్మాదాన్ని తరిమివేయాలి.
గుజరాత్ లో హిందూ మతోన్మాదులు ముస్లిం జనాలపై చేసిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... స్త్రీల పై మృగాల్లా గ్యాంగ్ రేపులకి పాల్పడ్డారు... మూడన్నర సంవత్సరాల బాలికలను సైతం వదలలేదు.. తర్వాత వారిని ముక్కలుగా నరికి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. నోటి నిండా కిరోసిన్ తాగించి ... నోట్లో అగ్గిపుల్ల వేసి మనుషుల్ని పెట్రోలుబాంబులుగా పేల్చేసిన సంఘటనలు... వికలాంగుల్ని సైతం మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి కాల్చేసిన విద్వేషం... గర్భాన్ని చీల్చి పిండాల్ని మంటల్లో వేసిన దారణాలు.... శిశువుల్ని సైతం కాల్చేసిన క్రూరత్వాలు... ఈ కసాయి పనులు చేస్తూ ఆ మృగాలు ఏమని నినాదాలిచ్చాయో తెలుసా... 'జై శ్రీరామ్'. జై శ్రీరామ్'
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే! రామాయణంలో రాముడు తన భార్యని ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్దం చేశాడు. రాముడు రేపిస్టులకీ, హంతకులకీ, దేముడెలా అవుతాడు? అలా అనడానికి ఎవరికైన ఎంత ధైర్యం?
సీతను ఎత్తుకెళ్లిన రావణుడు సైతం ఆమెను బందీగా చేసినా గౌరవంగా చూశాడేకానీ ఈ తరహా ఆకృత్యాలకు పాల్పపడలేదు కదా.... ఈ పిశాచులు పవిత్ర రామనామం సంగతి అటుంచి, రావణుడి పేరు ఎత్తేందుకు కూడా అర్హత లేని హీనులు.
బజరంగ్ దళ్ అంటే హనుమంతుడి సైన్యం అని అర్థం. హనుమంతుడు, వానరసైన్యం సీతను ఎత్తకెళ్లిన రావణుడితో యుద్దం చేశారు. హన్మంతుడు ఆజన్మ బ్రహ్మ చారి, పరమ భక్తుడూ, సీతని విడిపించే ధర్మకార్యానికి సాహసంతో ముందుకి దూకిన వాడూ, రామ నామం పట్ల నిరుపమాన భక్తి కలవాడు.
హనుమంతుడి పేరు చెబితేనే పిశాచాలు పారిపోతాయంటారు. హత్యలు రేపులు, రేపులు చేసే పిశాచాలు - పరమ భాగవతోత్తముడు ఆంజనేయుడి పేరు ఎలా పెట్టుకుంటారు? హంతకుల, రేపిస్టుల, లూటీకారుల, నేరస్తుల సైన్యం - పిశాచ దళ్ అని పేరు పెట్టుకోవాలి కానీ బజరంగ్ దళ్ అని పేరు ఎలా పెట్టుకుంటారు?
గుజరాత్ హంతకమూకల చర్యలను ఏ మత గ్రంథం సమర్థిస్తుంది,
వివేకానందుడూ, ఠాగూర్, గాంధీ, నారాయణగురు, వంటి మహానీయులనీ, అందించిన ధర్మానికి అంతర్జాతీయంగా మచ్చ తెస్తున్న హంతకుల లూటీదారులు మూక - హిందూ మతానికి ప్రతినిధులు ఎలా అవుతారు?
ఇస్లాం అంటే శాంతి అని అర్ధం. భగవంతుని పట్ల నిష్ఠ, విశ్వాసం ఇస్లాంకి ప్రాణశక్తి.
హిందూ ముస్లింల మైత్రికి పునాది వేసిన ఆదర్శ పాలకుడు అక్బర్, కారణజన్ముడు కబీర్, స్వాతంత్రోద్యమ సింహం 'అష్ఫా ఖుల్లా' హిందూ ముస్లిం మైత్రిని కోరిన అబ్దుల్ కలామ్ ఆజాద్, 'ఖుదాయే ఖిద్మత్ గార్' వంటి త్యాగపూరిత సంస్థని సృష్టించిన మహాత్ముడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్' దేశ రక్షణని తపస్సుగా స్వీకరించిన ఋషితుల్యుడు అబ్దుల్ కలామ్' లోకోత్తర కళాకారుడు బిస్మిల్లాఖాన్' యుద్ధరంగంలో విజృంభించి మూడు పాకిస్థాన్ ట్యాంకుల్ని పేల్చి, ఆత్మాహుతి దాడితో నాలుగవ ట్యాంకుల్ని పేల్చి చివరికి అమరుడైన పరమవీర చక్ర అబ్దుల్ హమీద్, భారత్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉప ఖండం ప్రజలను వందేమాతరం స్ఫూర్తిలో ఓలలాడించిన ఎ. ఆర్. రహమాన్ ...ఒక్కరా ఇద్దరా ... భారతీయా ఇస్లాం ఎన్ని అమూల్య రత్నాలను అందించిందని .. భారతీయ ఇస్లాం స్ఫూర్తికి ప్రతినిధులు అయ్యేది వీరు.
జమ్మూలో బస్ లో చొరబడి, కాశ్మిర్ లో గ్రామాల్లో చొరబడి ... హిందువులని సిక్కులని వేరు చేసి పిల్లాపాపలతో సహా - నిలబెట్టి కాల్చి చంపే రాక్షసులు , గోధ్రాలో రైలు బోగీకి నిప్పు పెట్టి, చివరికి తప్పించుకుని కిందకి దూకే ప్రాణాలని కూడా నరికి మంటల్లో వేసే పాపాత్ములు... మాతృదేశానికి ద్రోహం చేసి పొరుగు దేశపు కనుసైగతో ఇక్కడ విధ్వంసానికి తెగబడే ఉన్మాదులు... భారతీయ ఇస్లాం కి ప్రతినిధులు ఎలా అవుతారు? అసలు ఆ పాపాత్ములు ముస్లింలు ఎలా అవుతారు.? ఖురాన్ కానీ, మారే పవిత్ర గ్రంథమైన వారి దౌష్ట్యాలను ఎలా సమర్థిస్తుంది? వారు తమపాపాలకు సాకుగా ఇస్లాంను, ఖురాన్ ను ఎలా చూపగలరు?
హిందువులైన, ముస్లింలైనా... మతోన్మాదులను మతాలనుంచి వేరు చేయాల్సిన అవసరం ఉంది.
నిజమైన హిందువులు, ముస్లిం లు.. ఆస్తికులు - ఈ ఉన్మాదుల చర్యలను ఖండించాలి. వారు మతం పేరుని ఉపయోగించుకోలేని పరిస్థితిని తీసుకురావాలి
ఆర్.ఎస్.ఎస్ హిందువులకి, హిందుస్తానికి, వ్యతిరేకి, శత్రువూ...
ఆర్.ఎస్.ఎస్ వేషం... ఖాకీ నిక్కరూ, నల్ల టోపీ.. భారతీయ ఆహార్యం కాదు , (మహా అయితే ఈ ఖాకీ నిక్కర్లకి 1925 నాటి బ్రిటిష్ పోలీసుల ఆహార్యం స్ఫూర్తి అయి ఉండవచ్చు)
మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు ,దేశప్రజలంత ఇక్కట్ల పాలవుతూ భారతమాత శృంఖలాలు తెంచేందుకు హిందువులూ ముస్లింలూ సమైక్యంగా స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న కాలంలో ఆర్.ఎస్.ఎస్ ఆ మహత్యర పోరాటానికి దూరంగా ఉంది. ఆర్.ఎస్.ఎస్. భావజాలంతో స్ఫూర్తి పొందిన వ్యక్తే జాతిపీత గాంధీజీని చంపేశాడు. నాడు ఆర్.ఎస్.ఎస్ దేశ ప్రజల ఆగ్రహాన్ని, అసహ్యాన్ని చవిచూసింది.
మాట్లాడితే జాతీయత గురుంచి వల్లెవేసే ఆర్.ఎస్.ఎస్ నిజానికి జాతిని ముక్కలు చేయడమే అజెండాగా పెట్టుకుంది. ఆర్.ఎస్.ఎస్ కి ఎంతగా దేశభక్తి లేదంటే .... చివరికి మొన్నమొన్నటి వరకూ అది మన జాతీయ పతాకానికి సైతం వ్యతిరేకం . ఆ మధ్య కర్ణాటక లోని ఒక ఈద్గా మైదానం లో మన జాతీయ జెండా ఎగరవేయట్లేదని సంఘ్ పరివార్ శక్తులు గొడవలకి దిగారు. నిజానికి వారికి గొడవలపైనే ఎక్కువ ఆసక్తి, జాతీయ జెండాపై కాదు.
ఎందుకంటే దశాబ్దాలుగా ఆర్.ఎస్.ఎస్ నాగపూర్లోని తన కార్యాలయం పైన ఏనాడూ జాతీయ జెండా ఎగరవేయలేదు. కేవలం పోయినేడు ఆగష్టు 15న ఏ కారణం చేతో వారు తమ పద్ధతి మార్చుకున్నారు .
సంఘ్ పరివార్ బహురూపి. స్వతంత్ర భారత్ చరిత్ర లోనే దేశ విభజన తరువాత అత్యంత దారుణ మైన విషాదం బాబ్రీమసీదు కూల్చివేత. ఈ నేరానికి బాధ్యత సంఘ్ పరివార్ దే. బాబర్ అయోధ్యలో దైవ మందిరాన్ని కూలగొట్టాడో లేదో మనకి తెలీదు. దానికి సరైన ఆధారము లేదు. అయితే మధ్య యుగాల సంగతి విడిచిపెడితే ...ఆధునిక కాలంలో అయోధ్య లో ఒక దైవ మందిరాన్ని కూల్చింది సంఘ్ పరివార్ .అందుచేత నిజమైన అర్ధం లో 'బాబరుకి ఔలాద్' ఆర్.ఎస్.ఎస్ అవుతుంది , భారతీయ ముస్లింలు కారు . మధ్య యుగాల్లో భారత దేశ శత్రువులు నాదిర్షా,గజినీ , ఘోరీలు చేసిన దారుణాలను ఇవ్వాళ సంఘ్ పరివార్ నిస్సిగ్గుగా చేస్తోంది. గుజరాతీలో వందల మసీదులను పరివార్ గుండాలు ధ్వంసం చేసారు .తాము గజినీ వారసులమని గజినీ తమకు ఆదర్శమని పరివార్ శక్తులు ఇప్పుడు ప్రతక్షయంగానే అంగీకరిస్త్తున్నారు. వి .హెచ్ . పి కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ఇటీవల ' మనం హిందూ గజినీలు అవుదాం' అని గర్వాంగానే చెప్పుకున్నారు
(నిషిద్ధ సంస్థ సిమి ఇండియాకి మరో గజినీ కావాలని ఉత్తర భారత దేశం లో పోస్టర్లు వేసింది . ఆ సంస్థ అధ్యక్షుడు డా: బదర్ గజనీ పట్ల తన ఆరాధనని దాచుకోరు. హిందూ ముస్లిం మతోన్మాదులు ఇద్దరికీ గజనీ ఆర్యాదుడు. అందుచేత వీరిద్దరినీ 'గజనిస్టు'లనో ' ఘోరీయిస్టుల' నో పిలవడం సమంజసం.)
ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమాన్ని "హిందుత్వ' అనడం, దాని దుర్మార్గాల్ని కాషాయీకరణ అనిపిలవడం - చాల పొరపాటు, హిందుత్వం- అంటే హిందూ మతం యొక్క సారాంశం అని అర్ధం. ఇస్లాం తత్వానికి 'సిమి' ప్రతినిధి' కానట్టే, హిందుత్వానికి ఆర్.ఎస్.ఎస్ ప్రతినిథి కాదు. ఒకవేళ ఆర్.ఎస్.ఎస్ చెప్పుకున్న దాని వ్యతిరేకులు సైతం ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాన్ని 'హిందుత్వం' గా పిలవటం పొరపాటు. 'కాషాయం' దేశంలోని కోట్లాది ప్రజలకు పవిత్రమైన వర్ణమని' కాషాయీకరణ అనే మాటను వ్యతిరేక అర్ధంలో వాడటం వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాడని - ఇటీవల కేరళ ముఖ్యమంత్రి ఎ.కె ఆంటోని సరిగానే చెప్పారు.
ఆర్.ఎస్.ఎస్. హిందూ మతానికి తాను ప్రతినిధినని ఏ రకంగా చెప్పుకుంటుంది? ఆ మాటకి వస్తే మొత్తం 'హిందూమతం' అని చెప్పబడేదానికి ఎటువంటి ఏకైక 'ఆధ్యాత్మిక కేంద్రం కానీ, మతాధిపతి కానీ గతంలో లేరు. ఇప్పుడు లేరు. ఆర్.ఎస్.ఎస్ కు హిందూమతపరంగా ఎటువంటి అధికారం లేదు. దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించే స్వతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ భాగస్వామి కాదు.
కాశ్మిర్ భారత్ లో అంతర్భాగమని అక్కడ ఉగ్రవాదులను పంపి కల్లోలాన్ని రెచ్చగొట్టడం మానుకోమ్మని - మన దేశంలోని అనేక ముస్లిం సంస్థలు, ప్రముఖులు పాకిస్థాన్ కి ఎన్నోసార్లు మొహం పగిలేలా చెప్పిన విషయం ఎందరికి తెలుసు?
ఇటీవల అమెరికాలోని మసాచు సెట్స్ సాంకేతిక సంస్థ వద్ద వున్నా దక్షిణాసియా సంఘం గుజరాత్ కల్లోల్లాన్ని చర్చించేందుకు ఒక సదస్సు ఏర్పాటు చేసింది.
ఆ సదస్సులో వి.హెచ్.పి. ప్రతినిధి చేసిన ప్రసంగం ఆవేశాలనే రెచ్చగొట్టింది. అయితే రామకృష్ణ మఠం ప్రతినిధిగా పాల్గొన్న స్వామి త్యాగానంద ప్రసంగం సర్వులను అలరించింది. ఆ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు:
"ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయాలపాలయ్యారో, ఎవరెవరు నిర్వాసితులు అయ్యారో, ఎందరి వాణిజ్య సముదాయాలు నాశనమయ్యాయో పత్రికల మూలంగా ఆయా అంకెలు వివరాలు మాత్రం మన వద్ద ఉన్నాయి. వేలాది కుటుంబాలు, మృతి చెందిన ప్రతి ఒక్కరూ, వారు తల్లి గానో, తండ్రిగానో, బిడ్డగానో, భర్తగానో లేక మరొకరిగానో ఉండవచ్చు, అయితే వారెంతటి విషాదం అనుభవిస్తున్నారో, అసలు వాస్తవ పరిస్థితి ఏమిటో మన ఎరుకలోని రాని విషయాలు. కుల ఘర్షణలలో మన ఆత్మీయులనో, ప్రియమైన వారినో కోల్పోయామన్న భావన మనకు కలిగితే ఈ విషాద నేపథ్యంలో చెలరేగిన భావావేశాలూ, అశాంతీ, భయానక పరిస్థితులనూ, మనం క్షుణంగా అర్ధం చేసుకోగలము.
సాటి మానవులపై జరిగిన ఈ దారుణాన్ని భావసారూప్యం కలిగిన వారంతా త్రీవ్రంగా ఖండించడం సమంజసమే..."
"...ప్రతి మతంలోనూ ప్రేమా, పరస్పర అవగాహన, శాంతిని గురించి మనం భోధిస్తున్నాము. అయితే మతం రంగుపులుముకుని కొన్ని వర్గాలు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి అర్ధం చేసుకోలేక పోతున్నాం.."
"...మతం అంటే ఏమిటి మతతత్వం అంటే ఏమిటి హింసకు తావులేకుండా మతం పట్ల విశ్వాశంగా ఉండలేమా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు ఎలాంటి ఉపద్రువాలనుంచైనా ప్రశాంతంగా, సునాసాయంగా బయట పడగలం..."
'...మన దైనందిన జీవనంలో వాక్సమేతంగా, భౌతికపరంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా ఉంటేనే మన ఖండన పూరిత సందేశాలకు అర్ధం ఉంటుంది. మన వివాదాలకు, అనంగీకారాలను పరిష్కరించుకోటానికి మార్గాలను అన్వేషించగల సత్తా మనకుంది. ఇలాంటి పరిస్థితులలో పరస్పర అవగాహన, గౌరవపూర్వక వాతావరణంలో చర్చలు జరపటమే ఉత్తమమైన పరిష్కార మార్గం. నిర్మాణాత్మకంగా, శాంతి పూర్వకంగా చక్కటి పరిష్కార మార్గాన్ని అన్వేషించటానికి ప్రయత్నిద్దాం. మనకు అంగీకారం కాకపోయినా ఇతరులు ఏమి చెబుతున్నారో వినేందుకు ప్రయత్నించడమే కార్య సంకల్పానికి శుభారంభం అవుతుంది. మన ఎదుటి వారి మాటలను మనం పట్టించుకోనప్పుడు, మన మాటలను వారు ఖాతరు చేయాలని, మనల్ని అర్ధం చేసుకోవాలని ఎలా ఆశించగలం?"
మతానికీ మానవత్వానికి నిర్వచనం ఇదీ!
కాదని ఎవరనగలరు - ఒక్క మతోన్మాదులు తప్ప.
'జైభారత్ సంస్థ మన మహత్తర దేశంలో, మతాలనుంచి, మొత్తంగా ప్రజా జీవనం నుంచీ మతోన్మాదాన్ని వేరు చేసి, ఓడించే దిశగా పనిచేస్తుంది'
( విజయవిహారం జూన్ 2002)
వివరాలకు:
జైభారత్ కేంద్ర కార్యాలయం,
9849995538.