Sunday, May 18, 2014

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? 

-------------------------------------------------------------
ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగాపడిన ఒక ఆడకూతిరిలా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది.
తీరని కోరికలతో లక్ష్య బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది దేశం.
గాలికి ఉబ్బిపోయిన ఒక గుడారంలాగుంటుంది.
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం ఎలాగుంటుంది.?
ఐదేళ్ళ నిద్రకు కొంగుపరుచుకొంటున్న పిల్లల తల్లిలాగుంటుంది.
నా దేశం ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
అసత్య ప్రచారాల, జయ విజయధ్వానా ఘోష తగ్గినాక మనకి హఠాత్తుగా మన దరిద్ర సముద్ర హోరు వినిపిస్తుంది.
మనకి భోజనం లేదని గుర్తుకువస్తుంది.
మనకి ఉపాది లేదని, మనకి దిక్కు దివాణం లేదని,
మనకి తెరువూ, తీరు లేదని మళ్ళి గుర్తుకు వస్తుంది.
మనకి మళ్ళి వెనుకటి మన చక్రవర్తుల బిడ్డలా పట్టాభిషేకం గుర్తుకు వస్తుంది.
మన త్రివర్ణ పతాకం మీద పరాయి మనుషుల నీడలు పడుతున్నాయని, మనకి మళ్ళి భయం వేస్తుంది. పంచ వర్ష ప్రణాళికల ఓటి చప్పుడు వినిపిస్తుంది.
ఇరవై సూత్రాలకు ముడి లేదని, పథకాలు పారడం లేదని మనకి మళ్ళీ గుర్తుకు వచ్చి మన మీద మనకి జాలేస్తుంది.
సమస్యల పరిష్కారం కోసం కాక ఓటు నెల్లుకొవటానికి మనకి నినాదాలు వినిపించారని తెలుస్తుంది.
మనల్ని భయపెట్టి, మనల్ని భ్రమపెట్టి, మన భయాల్ని మనకి ఎరగా చూపి మనల్ని మనవాళ్ళే వేసుకున్నారని తెలిసి మనకి కొంత బాధ కలుగుతుంది.
రోగాలతో కుళ్ళి పోతున్న మన అమాయక దేశాన్ని మోసం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
గోపి చిన్న వాడని పడుచుని మందలోడు మోసం చేసినంత తేలికగా
మనల్ని "మనవాళ్ళు" చేయగలరు.
సోలడు గింజలకు మందులున్నాయి
అద్దెడు గింజలకు మందులున్నాయి
పిడికెడు గింజలకు మందులున్నాయి
తల నొప్పులకు మందులున్నాయి
శిరసు బాధలకు మందులున్నాయి
సూతిక నొప్పులకు మందులున్నాయి...
అని సైకిలెక్కి అసత్య ప్రచారం చేస్తాడు.
ఉత్తరాంద్రలో జానపదంలో మందుల మోసగాడు.
దారిద్రానికి మందులున్నాయి.
నిరుద్యోగానికి మందులున్నాయి.
సమైక్యతకు మందులున్నాయి.
సౌష్టవానికి మందులున్నాయి
అంటారు ఎన్నికలలో మనవాళ్ళు
సమస్యలు మిగిలిపోతాయి
నినాదాలు మారిపోతాయి
మందలోడు మారు వేషం వేసుకుని, మరో అసత్యప్రచారం ఆరంభిస్తాడు.
గోపిచిన్న వాళ్ళ భార్యలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మళ్ళీ వాటినే నమ్ముతారు. అందుకనే.
ఎన్నికలైపోయినాక ఒక విషాదాంతమైన ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం పరాయి వాడి పాలనలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.
ఎన్నికలైపోయినాక మనల్ని ఎవరో వెక్కిరిస్త్తున్నట్టే అనిపిస్తుంది.
ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది.
ఎన్నికల జ్వరం తగ్గిపోయిన తర్వాత మన పూర్వస్థితి గుర్తుకొచ్చి అంతా మునుపటిలాగే చీకటిగా, ఆకలిగా, నిరాశగా, నిస్సత్తువుగా అగమ్యంగా వున్నట్టు అర్ధం అవుతుంది.
పంచుకోలేక మనం తగవులాడుకుంటున్న రొట్టెను కోతి తినేసినట్టు తెలుస్తుంది.
అందరు సమానులేనని మనకి ఎన్నికలైపోయినాక తెలుస్తుంది.
పరాయి గజనీలైన, మన సొంత నిజాములైన ఒకటే అని బోధపడుతుంది.
శ్రీకృష్ణ దేవరాయలైన, ఔరంగాజేబైనా ఒకటేనని అర్ధం అవుతుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్ళకోసారి జీవితాంతం మోసపోవటం గురించి ఏడుపొస్తుంది.
మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మన మీద కొంత రోత పుడుతుంది.
మన బుద్ది గడ్డి తింటున్నాదని తెలిసీ సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,
పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.
ఈ మొహం మరో అయిదేళ్ళ వరకూ ఎవరికి చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.
........................................................................................................

- పతంజలి, ఉదయం దినపత్రిక, 29.12.1984 (పతంజలి భాష్యం నుండి)