Thursday, July 24, 2014

గుండె పగిలిన తండ్రి.

వహీద్ ...
వహీద్ ...
ఏడీ ... నా బంగారు తండ్రీ .. ??
రజియా .. రజియా ..
నా తల్లే .. ఎక్కడున్నావమ్మా?
ఇప్పుడే కదండ్రా .. నా చెంపలపై చెరో ముద్దు ఇచ్చి
మీ పెదాలకు అంటుకున్న నా బుగ్గల చెమటను
మీ యునిఫామ్ కాలర్ కి తుడుచుకుని
బస్సెక్కి గాల్లోకి నాకో నవ్వు విసిరి
నాన్న ఈవినింగ్ వరకు ఈ నవ్వును దాచుకో అని చెప్పి
వెళ్లారు .. పది నిమిషాలేగా ... అయ్యింది.

రజియా .. రజియా.. నా బంగారు తల్లే..!!
ఎక్కడున్నావ్ నాయనా..??
ఒక్కసారి "అబ్బూ నీను ఇక్కడే ఉన్నా " అని ఓ సారి పలకరా తల్లి ..
కంట్లో చాక్ ఫీసు డస్ట్ పడిందని ఒక రోజంతా ఎడ్చావు కదా తల్లి ..
ఈ ఇనప పెట్లకింద  యాడ నలిగిపోతున్నావ్ రా నాయనా ..

ఒకే ఒక్కసారి పలుకు నాయనా ..
బాబు వహీద్...
రేయ్ .. కొడకా..
చిన్న దోమ కుడితేనే నిద్రపోనోడివి ..
ఈ ఇనప రాడ్లల్లో ఎక్కడ పడున్నవురా .. అయ్యా ..

కొడుకో .. నా తండ్రి...
ఒక్కసారి "అబ్బు ఇక్కడే ఉన్న " అని ఒకసారి పలకరా..
ఎంతకి పలకని ఆ చిన్నారుల గొంతులు
...............................
ఈ తండ్రి గుండె ఇక కొట్టుకోవడం శాశ్వతంగా ఆగిపోయింది.
------------------------------------------------------------
( మెదక్ జిల్లా మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర స్కూల్ బస్సును రైలు  డి కోట్టిన ఘటనలో 20 మంది చిన్నారులలో ..వహిద్, రజియా కూడా ఉన్నారు .. ఈ వార్త విన్న ఈ చిన్నారుల తండ్రి గుండెపోటుతో మరణిచారు)
24-07-2014.


కన్నీళ్లు ఆగడం లెదు...

కన్నీళ్లు ఆగడం లెదు...

...............
బాయ్ నాన్న ..
బాయ్ మమ్మీ అని గట్టిగా  కౌగిలించుకుని
అమ్మ బుగ్గపై పెట్టిన ముద్దు తడి ఆరనే లేదు ..
నాన్న నేను ఈవెనింగ్ వచ్చేలోపు నీ సెల్లోకి కొత్త గేమ్ ని డౌన్లోడ్ చేసిపెట్టవా ..?
అని నాన్న నుండి తీసుకున్న మాట తాలుకు ఆనందం 
ఆబాబు మోములో ఇంకా దోబూచులాడుతూనే ఉంది.

మనకంటే పెద్ద వాడేగా  డ్రైవర్  అంకుల్..
మనకేం భయంలేదని భరోసాతో దోస్తు పెన్ను లాక్కుని 
తన చేతిలో రాసుకున్న బుజ్జి చెల్లాయి కొత్త పేరు
తెగిపడిన ఆ చేతిలో ఇంకా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అమ్మ ఆప్యాయంగా కలిపి పెట్టిన పెరుగన్నం
ఆ చిన్నారి రక్తంతో కళ్ళు చెదిరిపోయే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది.
అప్పుడే హొమ్ వర్క్ కంప్లీట్ చేస్కున్న  ఒక తమ్ముడి నోడ్సులో
ఓ చిన్నారి తల రైలు లాక్కేల్లడంతో దేనికో ఒరుసుకుని తలనుండి మెదడు ఉడి పడిపోయింది.

ఈ వార్త విని పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ తల్లికి
తను అప్పుడే హడావుడిగా ఉతికి ఆరి ఆరకనే తొడిగిన సాక్సు
ఒక కాలుకి తొడిగి ఉన్నట్టు కనిపించగానే
ఆ తల్లి ఆ కాలు పట్టుకుని మిగతా భాగాల కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే ఉంది.

ట్రైన్ ఈడ్చుకెళ్తున్న బస్సు నుండి ఓ బాబు
అంకుల్ ప్లీజ్ ట్రైన్ ఆపవా .. నాకాలు తెగి ఎక్కడో పడిపోయింది అరుపు...
కిలోమీటరు ఆ బస్సుని ఈడ్చుకెళ్ళి గాని ఆ ట్రైన్ ఆగలేకపోయింది .

కళ్ళ నుండే ప్రాణం పోయిందా అన్నట్టు ప్రాణం పోయిన
రెప్ప మూత పడని ఆ చిన్నారి కళ్ళు  నిర్లక్ష్యం నిండిన  
ఈ సమాజాన్ని ఎప్పటికి ప్రశ్నిస్తూనే ఉంటాయి

క్షణం క్రితం బోల్డన్ని కబుర్లు చెప్పుకుని నవ్వుకున్న ఆ పసి దేహాలు 
మరు క్షణం నిర్జీవపు ముద్దలయ్యాయంటే గుండెని ఎవరో పదునైన కత్తితో కోస్తున్నట్టే ఉంది ...
కన్నీళ్లు ఇప్పట్లో ఆగేలాలేవు ...
(ఈ రోజు మెదక్ జిల్లా మాసాయిపేట లో స్కూల్ బస్సుని రైల్ డీ కొట్టి 20 మంది పిల్లలు దారుణంగా చనిపొయారు. )

Sunday, May 18, 2014

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? 

-------------------------------------------------------------
ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగాపడిన ఒక ఆడకూతిరిలా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది.
తీరని కోరికలతో లక్ష్య బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది దేశం.
గాలికి ఉబ్బిపోయిన ఒక గుడారంలాగుంటుంది.
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం ఎలాగుంటుంది.?
ఐదేళ్ళ నిద్రకు కొంగుపరుచుకొంటున్న పిల్లల తల్లిలాగుంటుంది.
నా దేశం ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
అసత్య ప్రచారాల, జయ విజయధ్వానా ఘోష తగ్గినాక మనకి హఠాత్తుగా మన దరిద్ర సముద్ర హోరు వినిపిస్తుంది.
మనకి భోజనం లేదని గుర్తుకువస్తుంది.
మనకి ఉపాది లేదని, మనకి దిక్కు దివాణం లేదని,
మనకి తెరువూ, తీరు లేదని మళ్ళి గుర్తుకు వస్తుంది.
మనకి మళ్ళి వెనుకటి మన చక్రవర్తుల బిడ్డలా పట్టాభిషేకం గుర్తుకు వస్తుంది.
మన త్రివర్ణ పతాకం మీద పరాయి మనుషుల నీడలు పడుతున్నాయని, మనకి మళ్ళి భయం వేస్తుంది. పంచ వర్ష ప్రణాళికల ఓటి చప్పుడు వినిపిస్తుంది.
ఇరవై సూత్రాలకు ముడి లేదని, పథకాలు పారడం లేదని మనకి మళ్ళీ గుర్తుకు వచ్చి మన మీద మనకి జాలేస్తుంది.
సమస్యల పరిష్కారం కోసం కాక ఓటు నెల్లుకొవటానికి మనకి నినాదాలు వినిపించారని తెలుస్తుంది.
మనల్ని భయపెట్టి, మనల్ని భ్రమపెట్టి, మన భయాల్ని మనకి ఎరగా చూపి మనల్ని మనవాళ్ళే వేసుకున్నారని తెలిసి మనకి కొంత బాధ కలుగుతుంది.
రోగాలతో కుళ్ళి పోతున్న మన అమాయక దేశాన్ని మోసం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
గోపి చిన్న వాడని పడుచుని మందలోడు మోసం చేసినంత తేలికగా
మనల్ని "మనవాళ్ళు" చేయగలరు.
సోలడు గింజలకు మందులున్నాయి
అద్దెడు గింజలకు మందులున్నాయి
పిడికెడు గింజలకు మందులున్నాయి
తల నొప్పులకు మందులున్నాయి
శిరసు బాధలకు మందులున్నాయి
సూతిక నొప్పులకు మందులున్నాయి...
అని సైకిలెక్కి అసత్య ప్రచారం చేస్తాడు.
ఉత్తరాంద్రలో జానపదంలో మందుల మోసగాడు.
దారిద్రానికి మందులున్నాయి.
నిరుద్యోగానికి మందులున్నాయి.
సమైక్యతకు మందులున్నాయి.
సౌష్టవానికి మందులున్నాయి
అంటారు ఎన్నికలలో మనవాళ్ళు
సమస్యలు మిగిలిపోతాయి
నినాదాలు మారిపోతాయి
మందలోడు మారు వేషం వేసుకుని, మరో అసత్యప్రచారం ఆరంభిస్తాడు.
గోపిచిన్న వాళ్ళ భార్యలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మళ్ళీ వాటినే నమ్ముతారు. అందుకనే.
ఎన్నికలైపోయినాక ఒక విషాదాంతమైన ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం పరాయి వాడి పాలనలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.
ఎన్నికలైపోయినాక మనల్ని ఎవరో వెక్కిరిస్త్తున్నట్టే అనిపిస్తుంది.
ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది.
ఎన్నికల జ్వరం తగ్గిపోయిన తర్వాత మన పూర్వస్థితి గుర్తుకొచ్చి అంతా మునుపటిలాగే చీకటిగా, ఆకలిగా, నిరాశగా, నిస్సత్తువుగా అగమ్యంగా వున్నట్టు అర్ధం అవుతుంది.
పంచుకోలేక మనం తగవులాడుకుంటున్న రొట్టెను కోతి తినేసినట్టు తెలుస్తుంది.
అందరు సమానులేనని మనకి ఎన్నికలైపోయినాక తెలుస్తుంది.
పరాయి గజనీలైన, మన సొంత నిజాములైన ఒకటే అని బోధపడుతుంది.
శ్రీకృష్ణ దేవరాయలైన, ఔరంగాజేబైనా ఒకటేనని అర్ధం అవుతుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్ళకోసారి జీవితాంతం మోసపోవటం గురించి ఏడుపొస్తుంది.
మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మన మీద కొంత రోత పుడుతుంది.
మన బుద్ది గడ్డి తింటున్నాదని తెలిసీ సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,
పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.
ఈ మొహం మరో అయిదేళ్ళ వరకూ ఎవరికి చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.
........................................................................................................

- పతంజలి, ఉదయం దినపత్రిక, 29.12.1984 (పతంజలి భాష్యం నుండి)