Saturday, April 7, 2012

శంకర పీఠాధిపతులు అంటరానివారు.


ఆది శంకరులు స్థాపించిన శంకర మఠాలు పరమ ఛాందసానికి మూల కేంద్రాలుగా ఉంటూ వస్తున్నాయి. శంకరులు ప్రచారం చేసిన అద్వైతం ఉత్కృష్టమైన ఆదర్శం. శంకర మఠాలు ఆది శంకరుల అద్వైతానికి, మరీ ముఖ్యంగా ఆయన మనీషా పంచకం స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.
  ''..ఆమధ్య ఒక బహిరంగ సభలో ఒక స్త్రీ వేద పఠనం చేస్తుంటే, అది అధర్మమని, ఆ బహిరంగ సభలోనే ప్రకటించిన ఓ శంకరస్వాముల ఉదంతం పత్రికల్లో ప్రముఖ వార్తగా చోటుచేసుకుంది..'' అని రావిపూడి వెంకటాద్రి 'అడుగు జాడలు' పుస్తకం (పే.141)లో రాశారు.
ఏకంగా... 'సతి'నే సమర్థించిన శంకరాచార్య ఉన్నారు. మరి రావిపూడి వెంకటాద్రి చెపుతున్న శంకరాచార్యులు ఎవరో మనకి తెలీదు. బహుశా చంద్ర శేఖర సరస్వతి స్వామే కావచ్చు.
తి ఆది శంకరులు దేశమంతా తిరిగి మొత్తం నాలుగు పీఠాలు స్థాపించారు. అయితే మనకి ఇప్పుడు 5 పీఠాలు ఉన్నాయి.
కంచి పీఠం ఆచార్యులు జయేంద్ర సరస్వతి ఇప్పుడు హత్యకేసు మీద జైలులో ఉన్నారు. దేశమంతటా పత్రికల్లో ఇదే ఇప్పుడు ప్రధాన వార్త. ఆయన ఆ హత్య చేశారో ..లేదో మనకి తెలీదు.
దేశంలోని చాలా... పత్రికలు, ఇప్పుడు... జయేంద్రని, ఆయనకంటే ముందు ఆ పదవిని అధిష్టించిన చంద్రశేఖర సరస్వతి స్వామితో పోల్చుతున్నాయి. జయేంద్ర కంటే చంద్రశేఖరసరస్వతి ఏవిధంగా మెరుగో విశ్లేషిస్తున్నాయి.
చంద్రశేఖర సరస్వతి ...కుల సమస్య, స్త్రీల సమస్య వంటి విషయాల్లో... కాస్త ఛాందసంగా ఉండేవారు కానీ... ఇలా హత్యలకు తెగబడలేదు.. అని కొందరు మెటికలు విరుస్తున్నారు...
హత్యని సమర్ధించాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ.... మిలియన్ల మంది ప్రజల మనసుల్ని విషపూరితం చేసి, వారికి కులం మీద, బాల్య వివాహాల మీద, స్త్రీల అణచివేత మీద మనసుకి హత్తుకునేలా బోధలు చేయడం కంటే, హత్య అనేది తక్కువ నేరమని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
చంద్రశేఖర సరస్వతి, మీడియా చేత, దేశంలోని ప్రముఖుల చేత సజీవదైవంగా, నడిచే దైవంగా...ఖ్యాతి అందుకున్నారు. అగ్రకుల మీడియాకి ఆయన కౄరత్వం అంత తేలిగ్గా అర్ధం కావడం కష్టం.
అర్ధం కావడం కష్టం.
1994లో అస్తమించేవరకూ చంద్ర శేఖర సరస్వతి - కులవ్యవస్థకి, హిందూ మతంలోని ఇతర దురాచారాలకు - కోట గోడ మాదిరిగా రక్షణగా నిలిచారు.
* భారతీయ విద్యా భవన్‌ వారు చంద్రశేఖర సరస్వతి ప్రవచనాలతో 'హిందూ ధర్మ, ది యూనివర్సల్‌ వే ఆఫ్‌ లైఫ్‌' అనే శీర్షికతో..., 800కి పైగా పుటలతో భారీగ్రంథాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న చంద్రశేఖర సరస్వతి అభిప్రాయాలు చూడండి:
కులమే బలం:
కులం మన బలహీనత కాదని, అదే మన బలమని స్వామి వాదిస్తారు. అంటారు. వేల సంవత్సరాల కాలంలో... ఎన్నో దాడుల్ని తట్టుకుని, ఇతర మతాల సవాళ్ళను తట్టుకుని హిందూ మతం ఇంకా జీవించి ఉన్నదంటే, అందుకు కారణం 'కులమే'నని. చంద్ర శేఖర సరస్వతి నమ్మకం. (చూడండి: హిందూ ధర్మ, పే.56,57)
వేదాలు పుట్టిన 'సప్త సింధు' ప్రాంతంలో...ఇవ్వాళ హిందూమతం తుడిచి పెట్టుకుపోయింది. గాంధార దేశం అని చెప్పబడే ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులు లేరు.
ఆది శంకరులు పీఠం నెలకొల్పిన కాశ్మీర్‌ సంగతేమిటి?
ఇవ్వాళ కాశ్మీర్‌ హిందువుల్లో కులాలు లేవు. ఉన్నది ఒకటే కులం. అదే బ్రాహ్మణ కులం. దీనర్ధం ఏమిటంటే, అక్కడ బ్రాహ్మణులు తప్ప మిగతా కులాల వారందరూ ...మతం మారి పోయారు. బ్రాహ్మణులు మిగిలిపోయారు.
అక్కడే సువిశాల దేశంలో ...అనేక ప్రాంతాల్లో, కింది కులాల వారు హిందూ మతాన్ని విడిచిపెట్టి, బౌద్ధాన్నో, ఇస్లాంనో, క్రైస్తవాన్నో ...ఎంచుకున్నారు. ఇవాళ దళితులు పెద్ద ఎత్తున హిందూ మతాన్ని ఖాళీ చేసి, క్రైస్తవంలోకి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది.
ఇంత జరుగుతున్నా... ఇవాళ ఎవరైనా... ఇసుకలోకి తల దూర్చిన ఉష్ట్ర పక్షి మదిరిగా మాట్లాడుతూ.., కులవ్యవస్థ, హిందూ మతానికి మంచి ఉపకారం చేసిందని నిస్సిగ్గుగా... వాదిస్తుంటే ...ఏంచేయాలి?
8సం.కే ఆడపిల్లలకి పెళ్లి చేయాలి!
అవును. చంద్రశేఖర సరస్వతి వారి అభిప్రాయాలు ఇవే. ఆడపిల్లల్ని, చదివించడం, ఉద్యోగాలకి పంపండం తప్పని స్వామివారి అబిప్రాయం. వాళ్లు తప్పుదారి పడతారని ఆయన ఆందోళన. ఆడదానికి, భర్తే ఈశ్వరుడని, 8సం.లకే పెళ్లి చేస్తే ఆడపిల్ల ఇక ఈ ఈశ్వర ప్రాయుడైన భర్త వద్దే కాళ్లు కడుగుతూ ..పడి ఉంటుందని స్వామి విశ్వాసం. బాల్యవివాహాల వలన, ఆడపిల్లలు ముక్కుపచ్చలారని వయసులో వితంతువులుగా మారుతున్నా, నష్టమేమిటని స్వామి ప్రశ్నిస్తారు. వితంతు పునర్వివాహం ఊసుకూడ స్వామికి గిట్టదు. (చూడండి: 'హిందూధర్మ', పే.578 -597)
స్మృతులు మారవు
మనుస్మృతి తదితర స్మృతుల్లో శూద్రుల పట్ల, స్త్రీల పట్ల ఎంత అమానుషమైన వైఖరి వ్యక్తమైనా... ఆ స్మృతుల్ని అక్షరం కూడా మార్చడానికి వీల్లేదని స్వామి అభిప్రాయం. (అదే పుస్తకం: పే.498)
పుట్టుకతోనే ...కులాలు
భగవద్గీత వంటి గ్రంధాల్లో స్వయంగా శ్రీకృష్ణుడే - వర్ణవ్యవస్థకి గుణ, కర్మలే కారణమని చెప్పినా.. చంద్రశేఖర సరస్వతి స్వామి.. అంగీకరించేందుకు సిద్ధంగా లేరు.
సంస్కరణ వాదుల పైన అయన విరుచుకుపడతారు. పుట్టుకతోనే, కులం సంక్రమిస్తుందని, తాను నిరూపించగలనని స్వామి ఢంకా బజాయించి చెపుతారు. కొన్ని కులాలకు మాత్రమే వేదాధికారం ఉంటుందని, స్వామి చెపుతారు. ఒకరి చేతి వంట మరొకరు తినరాదని, వర్ణాంతర వివాహాలు చేసుకోరాదని చెపుతారు. కులనిర్మూలనకి కృషిచేసే కంటే, దేవాలయాలు పెంచేందుకు కృషి చేస్తే నయమని చెపుతారు. కాళ్లు నెప్పి పుట్టేదాకా, ఊరేగింపుల్లో తిరగడం, గొంతు నొప్పి పుట్టేదాకా అరవడం మానేసి, ఏదైనా పనికొచ్చే పని చేస్తే నయమని స్వామి, కులవ్యతిరేక ఉద్యమకారులకి చెపుతారు. (అదే పుస్తకం: 615- 621, 615 -675)

*. ఈ ముసలి గెడ్డం స్వామి ప్రబోధాల్ని విని, ఎన్ని మిలియన్లమంది, తమ ఆడ పిల్లల్ని చదువుకి, ఉద్యోగాలకి పంపించకుండా ఆపేశారో...., ఎన్ని బాల్య వివాహాలు జరిగాయో.., ఎందరు వితంతువుల జీవితాలు అమానుష ఆచారాలకు బలై పోయాయో..., ఎంతమంది కులవిషాన్ని తమ తలలనిండా తనివితీరా నింపుకుని, తమ జీవితాల్ని, తమకి తటస్థ పడిన వారి జీవితాల్ని నరకంగా మార్చారో.. తలుచుకుంటే, భయం వేప్తోంది! ఒక హత్యకంటే, ఇటువంటి ప్రబోధాలు ఎన్నో లక్షల రెట్లు దారుణమని మన మేధావులకి, మీడియాకి ఎప్పటికైనా... అర్ధమవుతుందా?

*.  అసలు పుట్టుకతోనే... హెచ్చుతగ్గుల కులాలు, సహజంగా వస్తాయని..., బాల్యవివాహాలు చేయాలని, స్త్రీలకి చదువు పనికి రాదని వాదించే, స్వామి మీద కేసుపెట్టి, జైల్లోకి నెట్టాల్సిన అవసరం లేదా? సమానత్వానికి, పౌరహక్కులకి, హామీ ఇచ్చే రాజ్యాంగం అమలులో ఉండగా ...ఈ ముసిలి గెడ్డం స్వామి... మూర్ఖమైన, అమానవీయమైన అభిప్రాయాల్ని, భారతీయ విద్యాభవన్‌ వారు పుస్తకాలు వేసి ఎలా ప్రచారం చేస్తారు? ఇటువంటి పుస్తకాల్ని నిషేధించాల్సిన అవసరం లేదా? ప్రచురణ కర్తల మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా?
తి ఈ చంద్ర శేఖర స్వామి ...ఇంత దారుణంగా ఛాందస విషాన్ని చిమ్ముతుంటే, ఈయన్ని ఎదుర్కొన్న వారెవరూ లేరా? లేకేం ఉన్నారు. స్వామి దయానంద సరస్వతి శిష్యులు పండిత గోపదేవ్‌ - 60ల్లోనే 'శంకర పీఠాధిపతులు - అంటరాని వారు' అనే పుస్తకం రాసి, శంకర పీఠాధిపతి అధికారానికి, అహంకారానికి ప్రత్యక్షంగా సవాల్‌ విసిరారు. (ఇదే గోపదేవ్‌ 'అపశూద్రాధికరణము - శంకర భగవత్పాదులు' అన్న పుస్తకం రాసి, ఆది శంకరులనే ప్రతిభావంతంగా విమర్శించారు.)
*. 'శంకర పీఠాధిపతులు -అంటరాని వారు' గ్రంథం ముగింపులో గోపదేవ్‌ ఈ మాటలు రాశారు:
''....ఈ యంటరానితనమును పోకుండ కాపాడువారెవరు? దీనికి నా సమాధానము బ్రాహ్మణనామధారులు. వారిలో అందరు కాకపోయినను కొందరు పండితులు. శ్రోత్రియులమని చెప్పుకొనువారు ఈయంటరానితనమును శాశ్వతముగా హిందువులలో నాటుకొనియుండునట్లు యత్నించుచునే యున్నారు. ఇక వారి ఆచార్యుల సంగతి చెప్పనక్కరయే లేదు. ఆదిశంకరులు వేదమతము నుద్ధరించుటకు కాపాడుటకు నేర్పరచిన పీఠములు, పీఠాధిపతులు మాత్రము అంటరానితనమును కాపాడుచునే యున్నారు. పీఠాధిపతులు మాలమాదిగలను చూచుటయు దోషావహమందురు. మాలమాదిగలు స్వాములను దర్శింపనర్హులేకారు. ఎప్పుడైన మాలమాదిగలు ఆచార్యులదర్శనము చేసికొనుట సంభవించినపక్షమున ఆచార్యులు ప్రాయశ్చిత్తము చేసికొనువలసిన వారగుదురు. నూర్లకొలది స్నానములు చేసినకాని వారు శుద్ధులు కారు. ఇట్టి నియమాలు కామకోటి పీఠాధిపతులు మిక్కిలిగా పాటింతురనియు అందువలననే వారిలో నెక్కుడు మహత్తు కలదనియు నెందరో చెప్పగా వినుచున్నాము. దీనినిబట్టి చూచిన హిందువులలో అంటరానివారికీ పీఠాధిపతులు మిక్కిలి భయపడుదురని తోచెడివి....
....కామకోటి పీఠాధిపతులు చాల గొప్పవారట. వారు ఎన్నియో ఘన కార్యములను నిర్వహించుచున్నారట. వేదపరిషత్తులు, ఇంకను ఏవేవో పెట్టి వేలకు వేలు ధనము బ్రాహ్మణులకు వేదాధ్యయన సంపన్నులకు నిచ్చి వారి నుద్ధరించుచున్నారట. దానితోనే హిందువులెల్ల రుద్ధరింపబడుదురట. బ్రాహ్మణుల నుద్ధరించుటకు రాత్రింబవళ్ళు పాటుపడు పీఠాధిపతులు అంటరానివారి దుస్థితి నేల విచారింతురు? అంటరాని వారికి పీఠాధిపతులు దర్శనముకూడ నీయక స్వయముగా వారికి దూరులై అంటరానివారై తమ్ముతాము కాపాడు కొనుటలోనే తత్పరులై యుందురు. అంటరానివారు తమ్మును, తాము పూజించు దేవతలను చూచిన తాము తమ దేవతలు మైల బడుదుమని తలంతురు. కాని పీఠాధిపతులెంతో పవిత్రులై నందున వారిని జూచిన వారు పవిత్రులు కావలసియుండ, దానికి విపరీతముగా పవిత్రులే అపవిత్రుల దర్శనమున మైలబడుదురుట. వారి పవిత్రత యెంతదుర్బలమైనదో దీనినిబట్టి తెలియు చున్నది. వారి నేమనగలము? వారు చెప్పినది వేదము; వారాచరించినది ధర్మము.
బ్రాహ్మణులు బ్రాహ్మణ గురువులు నిట్టి యాచార ములను పాటించుచున్నంత వరకు నీ దేశమును హిందువులలో అంటరానితనము దూరము కాదు. హిందువులకు వారే నాయకులు, మార్గదర్శకులును. శ్రేష్ఠజన్ములు మిక్కిలి బుద్ధిమంతులు, విద్యావంతులు, కావున మిగిలిన హిందువులు వారినే అనుసరింతురు.
హిందువులలోని అంటరానితనము పోవలెననిన బ్రాహ్మణులమని చెప్పుకొనువారు కాక మిగిలిన హిందు వులెల్లరునేకము కావలయును. వారిలోగల హెచ్చుతగ్గు భావములను ముందు పోనాడవలెను. బ్రాహ్మణులను వారితో సహాయనిరాకరణము ప్రారంభింపవలయును. బ్రాహ్మణనామధారులకు సంఘములో ప్రస్తుతమున్న గౌరవ మర్యాదలనన్నింటిని త్రోసిపుచ్చవలెను. వారిని సభలలో గౌరవించుట మానవలెను. వారిని తాకిన ఇతరులు మైలబడి నట్లెంచి స్నానాదులనాచరింపవలెను. వారి పౌరోహిత్యము నంగీకరింపరాదు. వారి ఆశీర్వాదములనాశింపరాదు. వారు చూచుచుండగా తామేదియు తినరాదు. దృష్టి స్పర్శ దోషము లను కేవల బ్రాహ్మణ నామధారుల యెడ పాటింపనారం భింపవలెను. ఇట్లు చేయకున్న హిందువులలోనున్న అంటరానితనము రూపుమాయనేరదు. సంఘ శ్రేయస్సుకు, దేశశ్రేయస్సుకు వేరుపురువులుగ నున్న ఈ స్వార్ధపరులకు 'భవతీ భిక్షాం దేహి' అనుటయే శరణ్యమని ఋజువు చేయవలెను. దీనికిదియేమందు.''
రచన .రమణమూర్తి
(ఎడిటర్ విజయవిహారం)